Bandi Srinivasarao: ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు ఫైర్
- ఏపీలో ఉద్యోగ సంఘాల మధ్య ముదిరిన విభేదాలు
- సూర్యనారాయణ వర్సెస్ బండి శ్రీనివాసరావు
- సూర్యనారాయణ అక్కసు వెళ్లగక్కుతున్నారన్న బండి శ్రీనివాసరావు
- ఉద్యోగుల ప్రయోజనాలు తాకట్టుపెడుతున్నారని విమర్శలు
ఏపీలో ఉద్యోగ సంఘాల నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమపై సూర్యనారాయణ అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. గవర్నర్ ను కలిసి ఉద్యోగుల సమస్యలపై మాట్లాడకుండా, తమపై విమర్శలు చేయడమేంటని బండి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఇతర సంఘాలపై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
ఒకవేళ మీ సంఘమే పెద్దది అనుకుంటే రేపట్నించే ఉద్యమం చేయండి అని సూర్యనారాయణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీరొక్కరే చాంపియన్లు అయినట్టు, మేమేదో చవటలం అయినట్టు చిత్రీకరించడం మానుకోండి అని స్పష్టం చేశారు. 11 పీఆర్సీలు సాధించిన ఘనత తమ సొంతమని బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సూర్యనారాయణ తన స్వార్థం కోసం ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.
గవర్నర్ ను కలవడం పబ్లిసిటీ స్టంట్: వెంకట్రామిరెడ్డి ఆగ్రహం
అటు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గవర్నర్ ను కలవడం ఓ పబ్లిసిటీ స్టంట్ అని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ తో చర్చించిన తర్వాత కూడా గవర్నర్ వద్దకు వెళ్లడం ఏంటని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు.