Narendra Modi: రూ.100 లక్షల కోట్ల అప్పు చేసి.. ఒక్క మంచి పని చేశారా?: ప్రధాని మోదీకి కేటీఆర్ ప్రశ్న

KTR questioned Modi on rs 100 lakh crore debt
  • 9 ఏళ్ల పాలనలో ఏం మేలు చేశారని నిలదీత
  • దేశంలో లాజిక్‌ కన్నా మ్యాజిక్‌ను ఎక్కువగా నమ్ముతుంటారని వ్యాఖ్య
  • దావోస్‌లో ఓ జాతీయ చానల్ కు ఇంటర్వ్యూ
ప్రధాని మోదీ టార్గెట్ గా తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె. తారక రామారావు విమర్శలు చేశారు. మోదీ తన 9 ఏళ్ల పాలనలో దేశానికి ఏం మేలు చేశారని ప్రశ్నించారు. రూ.100 లక్షల కోట్ల అప్పు చేశారని, ఆ డబ్బుతో చేసిన ఒక మంచి పని కానీ, చేపట్టిన గొప్ప ప్రాజెక్టును గానీ చూపించగలారా? అని నిలదీశారు. 

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి మారకం విలువ, గ్యాస్‌ ధరలు.. తదితర అన్ని అంశాల్లోనూ దేశాన్ని దశాబ్దాలు వెనక్కి నెట్టారని విమర్శించారు. మతవిద్వేషాలు, విభజన రాజకీయాలతో ఈ అంశాలపై చర్చ జరుగకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్‌ దేశం ముందు ప్రత్నామ్నాయ ఎజెండా ఉంచుతున్నారని చెప్పారు. 

ప్రస్తుతం వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు జరుగుతున్న దావోస్‌లో కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఓ జాతీయ మీడియా చానల్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. దావోస్‌లో భారత్‌ నుంచి ఐదారు రాష్ట్రాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, తమ రాష్ట్రంలోని వసతులను, పారిశ్రామిక అనుకూల విధానాలను వివరిస్తున్నాయని, అయినా పారిశ్రామికవేత్తలు తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా గుర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు.

దేశంలో ప్రస్తుతం లాజిక్‌ కన్నా మ్యాజిక్‌ను ఎక్కువగా నమ్ముతుంటారని కేటీఆర్ అన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ కోసం దేశ మహిళలు ప్రపంచంలోనే అత్యధిక ధర చెల్లిస్తున్నారని, ఈ విషయం వాళ్లకు చెప్పాలన్నారు. మోదీకి ముందు దేశాన్ని 14 మంది ప్రధానులు పరిపాలించారని, వారంతా కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పు చేస్తే.. మోదీ ఒక్కరే ఒంటిచేత్తో ఎనిమిదేండ్లలో రూ.100 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు.
Narendra Modi
ktr
davos
100 lakh crore

More Telugu News