Cricket: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఐసీసీ.. రూ. 20 కోట్లకు కుచ్చుటోపీ
- అమెరికా నుంచి గతేడాది మోసం
- అధికారికంగా స్పందించని ఐసీసీ
- అంతర్గత విచారణ జరుపుతున్న వైనం
సైబర్ నేరగాళ్లు అమాయకులకే కాదు ప్రముఖ సంస్థలకు కూడా కుచ్చుటోపి పెడుతున్నారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ)ని మోసం చేశారు. ఏకంగా రూ.20 కోట్లకు పైగా కాజేశారు. అమెరికా నుంచి గతేడాది ఈ స్కామ్ జరిగినట్టు సమాచారం. దీనిపై ఐసీసీ ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. అంతర్గత విచారణ చేపట్టింది. బిజినెస్ ఈ–మెయిల్ (బీఈసీ) అనే పద్ధతి ద్వారా ఈ మోసం జరిగింది. ఐసీసీకి చెందిన కన్సల్టెంట్ అంటూ ఈ సంస్థ నుంచి సొమ్మును కాజేసినట్లు సమాచారం.
కొన్ని కొనుగోళ్ల విషయమై అమెరికాకు చెందిన ఓ సంస్థకు ఐసీసీ చెల్లింపులు చేసింది. కానీ, అది తప్పుడు సంస్థ అని తెలిసి షాక్ కు గురైంది. ఐసీసీ కన్సల్టెంట్ ఈమెయిల్ ఐడీని పోలిన ఓ ఐడీతో మోసగాళ్లు ఈ తతంగం నడిపించారు. దాంతో, ఐసీసీ గుడ్డిగా నమ్మి చెల్లింపులు జరిపింది. ఏకంగా మూడుసార్లు చెల్లింపులు జరిపి 2.5 మిలియన్ డాలర్లు మోసపోయింది. విదేశాల్లో బిజినెస్ ఈ–మెయిల్ (బీఈసీ) మోసాలు ఈ మధ్య తరచూ జరుగుతున్నాయి. కానీ, ఆర్థికంగా ఎంతో బలమైన, పటిష్ఠ వ్యవస్థ కలిగిన ఐసీసీ మోసపోవడం చర్చనీయాంశమైంది.