Vani Jayaram: సీనియర్స్ పట్ల బాలసుబ్రహ్మణ్యానికి గల గౌరవం అదే: వాణీ జయరామ్
- మధురమైనగళం వాణీ జయరామ్ సొంతం
- ఒక రోజుకి 14 ..15 పాటలు పాడానన్న గాయనీమణి
- సుశీల .. జానకితో మంచి అనుబంధముందని వెల్లడి
- బాలూ లేకపోవడం తీరనిలోటు అంటూ వ్యాఖ్య
తెలుగులో సుశీల.. జానకి వంటి గాయనీమణుల జోరు కొనసాగుతున్న సమయంలో ఒక ప్రత్యేకమైన వాయిస్ ను వినిపించిన గాయని వాణీ జయరామ్. సంగీత ప్రధానమైన పాటను పాడించాలంటే అప్పట్లో అందరూ ఆమె డేట్స్ కోసం కాచుకుని కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. మిగతా భాషలతో పోల్చుకుంటే తెలుగులో ఆమె పాడిన పాటలు తక్కువే అయినా, ఆ పాటలు పాల మీగడలా శ్రోతల హృదయాలపై తేలుతూనే ఉంటాయి.
అలాంటి వాణీ జయరామ్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .."మొదటి నుంచి కూడా నాకు హిందీ పాటలంటే ఇష్టం. అప్పట్లో ఉన్న గొప్ప సంగీత దర్శకులందరితోను కలిసిపనిచేశాను. ఒక రోజుకి 14 నుంచి 15 పాటలు రికార్డు చేసిన సందర్భాలు ఉన్నాయి. సుశీల .. జానకి పాటలంటే నాకు చాలాఇష్టం. ఆ ఇద్దరితోను నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇంతవరకూ నేను పాడిన పాటలన్నీ క్లిష్టతరమైనవే" అని అన్నారు.
"ఇక బాలూ నాకంటే రెండేళ్లు చిన్నవాడు. సంగీత దర్శకుడు ఇచ్చిన పాటకు కొత్త సంగతులు చేర్చి పాడటంలో ఆయన దిట్ట. తనకంటే సీనియర్ ను కనుక .. తన కోసం నన్ను వెయిట్ చేయనిచ్చేవాడు కాదు. తనకి ఆలస్యమవుతుందని అనుకుంటే ముందుగానే కాల్ చేసి చెప్పేవాడు. పెద్దల పట్ల ఆయనకి గల గౌరవం అది. ఆయనలేని లోటు ఎవరూ తీర్చలేనిది" అంటూ చెప్పుకొచ్చారు.