deputy tehsildar: స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్ పై వేటు

deputy tehsildar anand kumar reddy suspended

  • ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిన ప్రభుత్వం
  • ఆదేశాలు జారీ చేసిన మేడ్చల్ కలెక్టర్
  • ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఆనంద్ కుమార్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి, సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ ‌కుమార్‌ రెడ్డిపై వేటు పడింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆనంద్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న ఆనంద్ కు రెవెన్యూ శాఖ అధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులను అందించనున్నారు. 

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో స్మితా సబర్వాల్ నివాసం ఉంటున్నారు. మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్న చెరుకు ఆనంద్ కుమార్ రెడ్డి... తన స్నేహితుడు బాబుతో కలిసి ఈనెల 19న అర్ధరాత్రి కారులో జూబ్లీహిల్స్ లోని ప్లజెంట్ వ్యాలీ వద్దకు వచ్చారు. బాబు కారులోనే ఉండగా ఆనంద్ కుమార్ రెడ్డి...  స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డారు. మొదటి అంతస్తులోకి వెళ్లి తలుపు కొట్టారు. దీంతో భయపడిపోయిన స్మితా సబర్వాల్.. పోలీసులకు ఫోన్ చేశారు. ఈ లోపు భద్రతా సిబ్బంది ఆనంద్, బాబును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

నిందితులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఆనంద్ ఉన్నారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News