Spotify: ‘స్పాటిఫై’లోనూ ఉద్యోగుల తొలగింపు.. ఈ వారంలోనే!
- వెల్లడించిన సంబంధిత వర్గాలు
- అక్టోబర్లో అనుబంధ సంస్థలో 38 మందిపై వేటు
- వరుసగా లేఆఫ్ లు ప్రకటిస్తున్న టెక్ సంస్థలు
టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పరంపర కొనసాగుతోంది. ఒకప్పుడు పోటీ పడి నియామకాలు చేపట్టిన సంస్థలు.. ఇప్పుడు కూడా అంతే పోటీ పడి స్టాఫ్ ను తీసేస్తున్నాయి. ఆర్థిక మాంద్యం భయాలతో ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా చిన్నా పెద్దా కంపెనీలన్నీ ఈ చర్యలకు దిగుతున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విట్టర్, మెటా వంటి కంపెనీలు ఎంతో మంది ఉద్యోగులను ఇంటికి పంపగా.. జాబితాలోకి మ్యూజిక్ సంస్థ ‘స్పాటిఫై’ కూడా చేరింది.
ఈ వారంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను స్పాటిఫై టెక్నాలజీ ప్రారంభించనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు పేర్కొంటున్నాయి. అక్టోబర్లో సంస్థకు చెందిన ‘గిమ్ లెట్ మీడియా అండ్ పోడ్కాస్ట్ స్టూడియోస్’కు చెందిన 38 మంది ఉద్యోగులపై వేటువేసింది. ఈసారి మరికొంత మందిని తొలగించేందుకు ఏర్పాట్లు చేసిందని సమాచారం. స్పాటిఫైలో 9,800 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. వీరిలో ఎంతమందిని తొలగించనుందనే విషయంపై స్పష్టతరావాల్సి ఉంది. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు స్పాటిఫై సంస్థ అధికార ప్రతినిధి నిరాకరించారు.
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు గత శుక్రవారం ప్రకటించింది. ఇది కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో 6 శాతానికి సమానం. అమెజాన్ మెటా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు కొత్త రిక్రూట్మెంట్లను నిలిపేశాయి. భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2023లో మొదటి 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 24 వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు.