herbal tea: ఈ కాలంలో తాగేందుకు ఎన్నో వెరై‘టీ’లు!

These herbal tea options could make your winter days healthier

  • సాధారణ టీతో పోలిస్తే వీటితో అదనపు ప్రయోజనాలు
  • చామంతి, మందార, తులసి, అల్లం, లెమన్ గ్రాస్ టీలు
  • వీటిని తాగడం వల్ల ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం

టీ (తేనీరు) తాగేందుకు ఇష్టపడని వారు బహుశా అరుదుగా ఉంటారు. ఎందుకంటే అలవాటు లేని వారు సైతం వరుసగా రెండు రోజులు టీ తాగితే చాలు మూడో రోజు తాగకపోతే మనసు తేలిక పడదు. అంతటి బలమైన వ్యసనాల్లో టీ, కాఫీలకు చోటు ఉంటుంది. టీ అంటే పాలు, నీళ్లలో తేయాకు వేసుకుని చేసుకోవడమే కాకుండా.. భిన్న రకాలుగా చేసుకుని, భిన్న రుచుల్లో తాగొచ్చు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే హెర్బల్ టీలు ఎన్నో ఉన్నాయి.

ప్రస్తుతం చలికాలం నడుస్తోంది. వేడి తగ్గిన ఈ తరుణంలో మనం తాగే టీ.. శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చేదై ఉండాలి. అప్పుడు దానివల్ల మరింత ఉపశమనం లభిస్తుంది. ఈ కాలంలో ఫ్లూ, జలుబు, దగ్గు, శ్వాస కోస సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం ఇచ్చేందుకు తాగాల్సిన టీలను తెలుసుకుందాం.

అల్లంటీ
 జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారికి అల్లం టీ ఉపశమనం కల్పిస్తుంది. అల్లంలో 6-జింజెరాల్ ఉంటుంది. ఇది గ్యాస్ట్రో ఇంటెస్టినల్ కండరాలకు విశ్రాంతినిస్తుంది. కనుక జీర్ణాశయ సమస్యలున్న వారు అల్లం టీ తాగొచ్చు. గర్భిణులకు వికారం పోవడానికి ఇది సాయపడుతుంది. టీకి అల్లం మంచి రుచిని కూడా ఇస్తుంది. ఉదయం వేళలు అల్లం టీ తాగేందుకు అనుకూలం. అల్లంటీలో పాలు కలపాలనేమీ లేదు. నీళ్లలో అల్లం ముక్కలు వేసి మరిగించి, చల్లార్చుకుని తాగొచ్చు.

లెమన్ గ్రాస్, జింజెర్ టీ
 ఇక నిమ్మగడ్డి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. ఇందులో యాంటీ హైపర్ గ్లైసిమిక్ ప్రాపర్టీలు ఉన్నాయి. కనుక మధుమేహులకు ఇది చాలా మంచిది. ప్రతి రోజూ ఉదయం పూట లెమన్ గ్రాస్, అల్లం టీ తాగాలి. నీళ్లలో కొంత నిమ్మగడ్డి, అల్లం వేసి కాచిన అనంతరం, వేడి తగ్గిన తర్వాత తాగాలి.

మందార టీ
మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి మందార టీ ఉపశమనం ఇస్తుంది. నొప్పి నివారిణి గుణాలు మందారలో ఉన్నాయి.  కనుక కండరాలకు ఉపశమనం కలుగుతుంది. మన శరీరంలో ఉప్పు, నీటిని సమతుల్యం చేసే ఆల్డోస్టెరాన్ అనే హార్మోన్ ను మందార క్రమబద్ధీకరిస్తుంది. ఇడి డైర్యూటిక్ (అధికంగా ఉన్న లవణాలను, నీటిని బయటకు పంపడం)గా పనిచేస్తుంది. ఎండబెట్టిన మందార పువ్వులను నీటిలో వేచి కాచి చల్లార్చుకుని తాగడమే. 

తులసి టీ
 తులసి చేసే మేలు గురించి మన పెద్దలు చెప్పగా వినే ఉంటారు. దగ్గు, జలుబు సమయంలో పెరట్లో తులసి చెట్టు నుంచి ఆకులు తెచ్చుకుని తినమని సూచించడం వినే ఉంటారు. దగ్గు, జలుబు, గొంతు మంట, నొప్పి నుంచి తులసి టీతో ఉపశమనం లభిస్తుంది. ఆస్థమా, బ్రాంకైటిస్ సమస్యలకు సైతం పనిచేస్తుంది. యాంటీ అలర్జిక్ గా, వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు సాయపడుతుంది. కప్పు నీటికి ఐదు, పది తులసి ఆకులను కలుపుకుని కాచిన తర్వాత తాగాలి.  

చామంతి టీ
 నిద్ర పట్టక ఇబ్బంది పడే వారు కేమమైల్ టీని తాగొచ్చు. గాఢ నిద్ర వచ్చేందుకు అవసరమైన రసాయనాలు చామంతిలో ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే అపిజెనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మెదడులో రిసెప్టర్లను చేరుకుని విశ్రాంతికి సాయపడుతుంది. దీంతో మంచి నిద్ర పడుతుంది. ఇన్సోమ్నియా (నిద్రరాని సమస్య) సమస్యతో బాధపడేవారికి ఈ టీ మంచిది. స్టవ్ పై పాత్ర పెట్టి అందులో కొంత నీరు పోసి, కొన్ని చామంతి పూలను వేసి కాచి వడకట్టుకుని తాగడమే.

  • Loading...

More Telugu News