india and new zealand: మూడో వన్డే గెలిస్తే.. ఒక దెబ్బకి రెండు పిట్టలు
- క్లీన్ స్వీప్ పై టీమిండియా కన్ను
- గెలిస్తే వన్డేల్లో అగ్రస్థానానికి..
- ఇండోర్ స్టేడియంలో గతంలో ఆడిన 5 వన్డేల్లోనూ మనదే గెలుపు
కొత్త ఏడాదిలో టీమిండియా విజయాల హవా కొనసాగుతోంది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ను 2-1 తేడాతో గెలవగా.. మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఇక న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ను ఇప్పటికే గెలిచిన టీమిండియా.. మూడో వన్డేలోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.
మూడో మ్యాచ్ లోనూ గెలిస్తే టీమిండియా వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకుంటుంది. ఒక్క మ్యాచ్ గెలుపుతో.. ఇటు క్వీన్ స్వీప్.. అటు నంబర్ వన్ ర్యాంకును సాధించనుంది. కొత్త ఏడాదిలో వరుసగా రెండు క్లీన్ స్వీప్ లు చేసిన ఘనతనూ దక్కించుకుంటుంది.
వరుసగా రెండు ఓటములతో న్యూజిలాండ్ డీలాపడింది. హైదరాబాద్ మ్యాచ్‌లో చివరి దాకా పోరాడి ఆకట్టుకున్నా... రాయ్‌పూర్‌లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. కనీసం మూడో మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.
ఇక మూడో వన్డే జరగనున్న ఇండోర్ స్టేడియంలో బౌండరీ చిన్నది కావడంతో పరుగుల వరద పారే అవకాశం ఉంది. పైగా సగటున ఇక్కడ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 308. ఇక్కడ గత రికార్డులు కూడా టీమిండియాకు అనుకూలంగానే ఉన్నాయి. ఆడిన 5 మ్యాచ్ లలోనూ మన జట్టు విజయం సాధించింది. విధ్వంసక వీరుడు వీరేందర్ సెహ్వాగ్ వన్డేల్లో డబుల్ సెంచరీ చేసింది ఇక్కడే.