YS Vivekananda Reddy: హైదరాబాద్ సీబీఐ కోర్టుకు చేరిన వివేకా హత్య కేసు ఫైళ్లు
- 2019లో వివేకా హత్య
- కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ
- కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు
- కడప సెషన్స్ కోర్టు నుంచి ఫైళ్లు, చార్జిషీట్లు, వాంగ్మూలాల పత్రాలు తరలింపు
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసు ఫైళ్లు, చార్జిషీటు పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర కీలక డాక్యుమెంట్లు నేడు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు చేరుకున్నాయి. వీటిని ఇవాళ కడప జిల్లా సెషన్స్ కోర్టు నుంచి హైదరాబాద్ తరలించారు. మూడు పెట్టెల్లో వీటిని హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తీసుకువచ్చారు.
వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ కడప కోర్టులో ఐదుగురు నిందితులపై రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. ఇప్పుడవన్నీ బదిలీ అయిన నేపథ్యంలో, హైదరాబాదులోని సీబీఐ న్యాయస్థానం త్వరలోనే వివేకా హత్య కేసు విచారణను ప్రారంభించనుంది.