Team India: ఇండోర్ లో భారత్ పరుగుల మోత... కివీస్ టార్గెట్ 386 రన్స్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్
- 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగులు
- రోహిత్ శర్మ, గిల్ సెంచరీలు
- అర్ధసెంచరీతో రాణించిన పాండ్యా
న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా బ్యాట్స్ మన్ వీరవిహారం చేశారు. ఓపెనర్ల సెంచరీలు, మిడిలార్డర్ లో పాండ్యా హాఫ్ సెంచరీ, శార్దూల్ ఠాకూర్ దూకుడు నేపథ్యంలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. రోహిత్ శర్మ (101), శుభ్ మాన్ గిల్ (112) తొలి వికెట్ కు 212 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేయడం ఈ మ్యాచ్ లో హైలైట్.
హార్దిక్ పాండ్యా 54, కోహ్లీ 36, శార్దూల్ ఠాకూర్ 25 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ 17, సూర్యకుమార్ యాదవ్ 14 పరుగులు చేసి అవుటయ్యారు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ 3, బ్లెయిర్ టిక్నర్ 3, బ్రేస్వెల్ 1 వికెట్ తీశారు.
కాగా, ఈ సిరీస్ ఆద్యంతం కివీస్ బౌలింగ్ పై భారత్ బ్యాట్స్ మెన్ ఆధిపత్యం కనిపించింది. ఇప్పటికే తొలి రెండు వన్డేలు ఓడిపోయి సిరీస్ చేజార్చుకున్న న్యూజిలాండ్ జట్టు... ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకుందామని భావిస్తోంది. కానీ టీమిండియా అతి భారీస్కోరు కొట్టడంతో, కివీస్ ఆశలు నెరవేరడం ఏమంత సులువు కాదనిపిస్తోంది.