Team India: మూడో వన్డే కూడా మనదే... సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్

Team Indian clean sweeps the ODI series against New Zealand

  • ఇండోర్ లో మూడో వన్డే
  • 90 పరుగుల తేడాతో నెగ్గిన భారత్
  • భారీ లక్ష్యఛేదనలో 295 రన్స్ కు ఆలౌటైన కివీస్
  • చెరో 3 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్

రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా... న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ ఇండోర్ హోల్కర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భారత్ 90 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ ను ఓడించింది. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ ను 41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌట్ చేసింది. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీసి కివీస్ వెన్నువిరిచాడు. కుల్దీప్ యాదవ్ 3, చహల్ 2, ఉమ్రాన్ మాలిక్ 1, హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీశారు. 

కివీస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ డెవాన్ కాన్వే సెంచరీ సాధించాడు. కాన్వే 100 బంతుల్లో 138 పరుగులు చేశాడు. అయితే ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 

లక్ష్యఛేదనలో తొలి ఓవర్లోనే న్యూజిలాండ్ కు ఎదురుదెబ్బ తగిలింది. కొత్తబంతితో బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ ఫిన్ అలెన్ ను పెవిలియన్ చేర్చాడు. అయితే మరో ఓపెనర్ కాన్వే ధాటిగా ఆడగా, హెన్రీ నికోల్స్ (42), డారిల్ మిచెల్ (24) నుంచి అతడికి సహకారం లభించింది. 

ఈ దశలో శార్దూల్ ఠాకూర్ విజృంభించి మిచెల్, కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ (0)లను వరుస బంతుల్లో అవుట్ చేసి దెబ్బకొట్టాడు. కాసేపటికే గ్లెన్ ఫిలిప్స్ ను కూడా అవుట్ చేసిన ఠాకూర్ మూడో వికెట్ సాధించాడు. అయితే బ్రేస్వెల్ (26), శాంట్నర్ (34) భారత్ విజయాన్ని కాస్త ఆలస్యం చేశారు. 

ఇక, ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరగనుంది. తొలి టీ20 జనవరి 27న రాంచీలో జరగనుంది.

  • Loading...

More Telugu News