USA: అమెరికాలో కొనసాగుతున్న తుపాకుల మోత.. ముగ్గురిని చంపి ఆత్మహత్య చేసుకున్న దుండగుడు!
- నిందితుడు 21 ఏళ్ల యువకుడు
- యకీమాలోని కన్వీనియెన్స్ స్టోర్‌లో ఘటన
- ఈ ఏడాది ఇప్పటి వరకు 39 కాల్పుల ఘటనలు
అమెరికాలో తుపాకుల మోత ఇంకా కొనసాగుతోంది. దుండగుల దుశ్చర్యకు ప్రతి రోజూ ఏదో ఒక చోట అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కాలిఫోర్నియాలోని ‘హాఫ్ మూన్ బే’ పట్టణంలో రెండు రోజుల క్రితం ఓ వ్యవసాయ కార్మికుడు సహచరులపై జరిపిన కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరందరూ చైనాకు చెందిన వారే. అంతకుముందు మోంటెరీ పార్క్ నగరంలో చైనా న్యూ ఇయర్ వేడుకల్లో జరిగిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు.
ఈ రెండు ఘటనలను మర్చిపోకముందే వాషింగ్టన్‌లోని యకీమాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఓ కన్వీనియెన్స్ స్టోర్‌లో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు ముగ్గురిని కాల్పి చంపిన కొన్ని గంటల తర్వాత పోలీసులు చుట్టుముట్టడంతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సర్కిల్ కె మార్కెట్‌లో తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని యకీమా కౌంటీకి చెందిన 21 ఏళ్ల జారిడ్ హడాక్‌గా గుర్తించారు.
కాల్పులు యాదృచ్ఛికంగా జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడికి, బాధితులకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని పోలీసులు తెలిపారు. స్టోర్ లోపలికి నడుచుకుంటూ వెళ్లిన 21 ఏళ్ల నిందితుడు ఒక్కసారిగా కాల్పులు జరిపినట్టు చెప్పారు. స్టోర్ లోపల ఇద్దరిని కాల్చి చంపిన నిందితుడు బయటకొచ్చాక మరొకరిని కాల్చి చంపాడు.
ఈ ఘటన జరిగిన దాదాపు 10 గంటల తర్వాత లూసియానా నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో 12 మంది గాయపడ్డారు. ఈ ఏడాది ఇప్పటి వరకు అమెరికాలో 39 కాల్పుల ఘటనలు జరిగినట్టు పోలీసులు తెలిపారు.