Bharti Airtel: ఎయిర్ టెల్ లో ఇప్పుడు కనీస రీచార్జ్ ధర రూ.155
- ఇప్పటి వరకు ఉన్న రూ.99 ప్లాన్ ఎత్తివేత
- రూ.155 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు
- కాల్స్ ఉచితం, 300 ఎస్ఎంఎస్ లు ఉచితం
టెలికం రంగంలో గుత్తాధిపత్యం తో వినియోగదారుల గూబ గుయ్యమంటోంది. జియో వచ్చిన తర్వాత దాదాపు అన్ని కంపెనీలూ తట్టాబుట్టా సర్దుకుని పోవాల్సి వచ్చింది. ఇప్పుడు జియో, ఎయిర్ టెల్ బలంగా నిలబడగా.. వొడాఫోన్ రేపో, మాపో అన్నట్టుగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. బీఎస్ఎన్ఎల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ నామమాత్రంగా మిగిలిపోయాయి.
దీంతో ఎయిర్ టెల్ ఈ పరిస్థితులను అవకాశంగా తీసుకుని కనీస నెలవారీ రీచార్జ్ ను క్రమక్రమంగా పెంచుకుంటూ వెళుతోంది. కొన్ని నెలల క్రితం కనీస రీచార్జ్ ప్లాన్ రూ.36గా ఉంటే, దాన్ని రూ.99కు తీసుకెళ్లింది. తాజాగా రూ.99 ప్లాన్ ను కూడా ఎత్తేసింది. దీంతో 28 రోజుల కాల వ్యవధికి చేసుకోవాల్సిన కనీస రీచార్జ్ ఇప్పుడు రూ.155కు చేరింది. ఈ ప్లాన్ లో కాల్స్ అపరిమితంగా చేసుకోవచ్చు. 28 రోజులకు 1జీబీ ఉచిత డేటా లభిస్తుంది. 300 ఎస్ఎంఎస్ లు వస్తాయి. హెలో ట్యూన్స్ ఉచితం. ఏపీ సహా ఏడు సర్కిళ్లలలో ఇది అమల్లోకి వచ్చింది. కానీ, రిలయన్స్ జియోలో 28 రోజులకు చేసుకోవాల్సిన కనీస రీచార్జ్ రూ.209. ఇందులో రోజువారీ 1జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. కాల్స్ ఉచితం, రోజూ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం.
టెలికం పరిశ్రమ ఒక దశాబ్దం పాటు ఎన్నో గడ్డు పరిస్థితులను చూసిందన్నది నిజం. ఎన్నో కంపెనీలు పోటా పోటీగా చౌక ప్లాన్లను అందిస్తూ కస్టమర్లను ఆకర్షించడంపైనే దృష్టి పెట్టేవి. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీంతో ఎయిర్ టెల్ ఇంతకాలం తాను చేసిన పెట్టుబడులపై ప్రతిఫలాన్ని ఇప్పుడు రాబట్టుకునే ప్రణాళికలతో ఉంది. ఒక్కో యూజర్ నుంచి సగటున రూ.300 వస్తేనే తమకు లాభాలు ఉంటాయని ఆ సంస్థ చైర్మన్ సునీల్ మిట్టల్ చెబుతూనే ఉన్నారు.