Telangana: తెలంగాణలోని భారీ భవనాలలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేస్తాం: మంత్రి కేటీఆర్
- డెక్కన్ మాల్ అగ్నిప్రమాదం నేపథ్యంలో మంత్రులు, అధికారులతో కేటీఆర్ సమీక్ష
- ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయం
- అగ్నిమాపక శాఖకు ఆధునిక సామగ్రి అందజేస్తామని మంత్రి వివరణ
తెలంగాణలోని భారీ భవంతులు, అపార్ట్ మెంట్ లలో అగ్ని ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఫైర్ సేఫ్టీ నియమాలను తప్పనిసరిగా అమలుచేయాలని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ లోని డెక్కన్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బీఆర్ కే భవన్ లో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు, మేయర్, సీఎస్, డీజీపీలతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలను నివారించేందుకు హైదరాబాద్ తో పాటు ప్రధాన నగరాలలోని భారీ భవనాలలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలలో ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దని ఆయన సూచించారు. అవసరమైతే ఫైర్ సేఫ్టీ చట్టాలను కూడా మార్చుకోవాలని, అగ్ని ప్రమాదాలను నివారించేందుకు డ్రోన్లు, రోబోటిక్ సాంకేతికతను ఉపయోగించుకోవాలని చెప్పారు. సిబ్బందికి మరిన్ని శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
అగ్నిమాపక శాఖకు ఆధునిక సామగ్రిని అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.