suryakumar yadav: అవార్డుల ఖాతా తెరిచిన సూర్యకుమార్ యాదవ్.. ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక
- ‘టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ప్రకటించిన ఐసీసీ
- గతేడాది పొట్టి ఫార్మాట్ లో పరుగుల వరద పారించిన స్కై
- నంబర్ వన్ ర్యాంకు సొంతం..
- ఏడాదిలో అత్యధిక సిక్సర్ల రికార్డు నమోదు
పరుగుల రికార్డులతో గతేడాదిని ముగించిన స్టార్ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్.. ఈ ఏడాది అవార్డుల ఖాతా తెరిచాడు. ప్రతిష్ఠాత్మక ఐసీసీ పురుషుల ‘టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. పొట్టి క్రికెట్‌లో గట్టిగానే పరుగులను బాదిన స్కై.. ఇంగ్లండ్ యువ ఆటగాడు సామ్ కర్రన్, పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజాను వెనక్కి నెట్టి ఈ పురస్కారాన్ని దక్కించుకున్నాడు.
సూర్యకుమార్ యాదవ్ గత ఏడాది టీ20లలో 187.43 స్ట్రయిక్ రేట్‌తో 1,164 రన్స్ సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు బాదాడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో వెయ్యి పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. గత ఏడాది 68 సిక్సర్లు బాదిన అతడు.. టీ20 క్రికెట్ చరిత్రలో ఒక ఏడాదిలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా మరో రికార్డూ నెలకొల్పాడు. ప్రస్తుతం టీ20ల్లో నంబర్ వన్ ర్యాంకులో ఉన్నాడీ 360 డిగ్రీస్ బ్యాట్స్ మన్.
ఇక భారత మహిళల పేస్ బౌలింగ్ సంచలనం రేణుకా సింగ్.. ఐసీసీ ‘ఎమర్జింగ్ ఉమన్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును సొంతం చేసుకుంది. గత యేడాది 29 మ్యాచ్‌లలో రేణుక 40కి పైగా వికెట్లు దక్కించుకుంది. మహిళల టీ 20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఆస్ట్రేలియాకు చెందిన తహీల మెక్‌గ్రాత్‌ను వరించింది. ప్రస్తుతం మెక్ గ్రాత్ టీ20ల్లో నంబర్ వన్ గా ఉంది.