Ex Terrorist: కశ్మీర్ లో మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసిన మాజీ టెర్రరిస్టు
- 1998 నుంచి 2006 వరకు హుజీలో పని చేసిన షేర్ ఖాన్
- 2006లో లొంగిపోయిన వైనం
- భారత్ ఉన్నతికి జీవితాన్ని వెచ్చిస్తానన్న షేర్ ఖాన్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్ లో ఒక అద్భుతమైన సన్నివేశం చోటుచేసుకుంది. మాజీ ఉగ్రవాది షేర్ ఖాన్ భారత మువ్వన్నెల పతాకాన్ని కిష్టవార్ ప్రాంతంలోని సెగ్డీ బాటా గ్రామంలోని తన నివాసం ఎదుట ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన జీవితాన్ని తన దేశ ఉన్నతి కోసం వెచ్చిస్తానని చెప్పారు.
1998 నుంచి 2006 మధ్య కాలంలో హర్కత్ ఉల్ జిహాద్ ఈ ఇస్లామీ (హుజీ) ఉగ్ర సంస్థలో ఆయన పని చేశారు. అప్పట్లో ఆయన పేరు చెపితే జిల్లా మొత్తం భయపడేవారు. 2006లో ఆయన లొంగిపోయారు. 13 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించి 2019లో విడుదలయ్యారు. ప్రస్తుతం ఆయన తన రెండో భార్య షహీనా, ఇద్దరు కుమార్తెలు సుమయా (19), ఖలీఫా బానో (17)తో కలిసి నివసిస్తున్నారు.
తన జీవితంలో ఆయన తొలిసారి మన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడేళ్ల క్రితం తాను జైలు నుంచి విడుదలయ్యాక... మొఘల్ మైదాన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు వెళ్లానని చెప్పారు. ఇంకోవైపు ఆయన తొలి భార్య పర్వీనా (42) విడిగా జీవిస్తోంది. ఆమెతో పాటు వీరి 20 ఏళ్ల కొడుకు ముసాఫిర్ కూడా నివసిస్తున్నాడు.