Hyderabad: మొదలైన హైదరాబాద్ దక్కన్ మాల్ కూల్చివేత పనులు
- రాంగోపాల్పేటలోని దక్కన్ మాల్లో ఇటీవల అగ్నిప్రమాదం
- ముగ్గురు సజీవ దహనం
- భవనం కూలిపోయే ప్రమాదం ఉండడంతో ముందే కూల్చేయాలని నిర్ణయం
- రూ.33 లక్షలతో టెండరు దక్కించుకున్న మాలిక్ ట్రేడర్స్
- గత రాత్రి భవనంలో మళ్లీ మంటలు
సికింద్రాబాద్ సమీపంలోని రాంగోపాల్పేటలోని దక్కన్ మాల్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఈ మాల్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఏ క్షణాన్నయినా కూలిపోయే ప్రమాదం ఉండడంతో దానిని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా గత రాత్రి 11 గంటల సమయంలో కూల్చివేత పనులను ప్రారంభించారు.
కూల్చివేత పనులకు సంబంధించి టెండరు దక్కించుకున్న ఎస్కే మల్లు కన్స్ట్రక్షన్స్ సంస్థ నిన్న ఉదయం భారీ క్రేనుతో కంప్రెషర్ యంత్రాన్ని భవనంపైకి తీసుకెళ్లి క్రేనుతో అలాగే పట్టి ఉంచి ఒక్కో స్లాబును కూల్చుకుంటూ వస్తామని తెలిపింది. అయితే, అధికారులు అందుకు అంగీకరించలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేయడంతో సాయంత్రానికి ఆ కాంట్రాక్టును రద్దు చేశారు.
దీంతో రూ. 33 లక్షలతో టెండరు దక్కించుకున్న మరో సంస్థ మాలిక్ ట్రేడర్స్ రంగంలోకి దిగింది. పొడవైన జేసీబీతో రాత్రి భవనం వద్దకు చేరుకున్న మాలిక్ ట్రేడర్స్ భవనం కూల్చివేత పనులు ప్రారంభించింది. కూల్చివేత పనుల వల్ల సమీపంలోని బస్తీ వాసులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి తలసాని హామీ ఇచ్చారు. కాగా, దక్కన్ మాల్లో నిన్న రాత్రి కూడా మళ్లీ మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.