Rajinikanth: ఆ రోజుల్లో శాకాహారులను చూసి బాధపడే వాడిని: రజనీకాంత్
- కండక్టర్ గా ఉన్నప్పుడు రోజూ మద్యం, సిగరెట్ తాగేవాడినన్న రజనీ
- మాంసాహారంతోనే రోజు మొదలు పెట్టేవాడినని వెల్లడి
- తన భార్య లత ప్రేమతో వీటిని మాన్పించేలా చేసిందని కితాబు
సూపర్ స్టార్ రజనీకాంత్ వీలు చిక్కిన ప్రతి సందర్భంలోనూ తన జీవిత భాగస్వామి లత గురించి చెబుతుంటారు. తాజాగా తన కెరీర్ ఆరంభంలో తనకున్న చెడు అలవాట్లను గురించి వెల్లడించారు. ఇటీవలే చెన్నైలో వై జీ మహేంద్రన్ ‘చారుకేసి’ కార్యక్రమం 50వ రోజు సంబరాలు జరిగాయి. ఈ వేడుకకు భార్య లతతో కలసి రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ తన జీవిత భాగస్వామి లతను పరిచయం చేశారు.
తాను కండక్టర్ గా పనిచేసే రోజుల్లో సిగరెట్లు, మద్యపానం, మాంసాహార అలవాట్లు ఉండేవన్నారు. నటుడిగా కెరీర్ మొదట్లోనూ ఈ అలవాట్లు కొనసాగినట్టు వివరించారు. లత వల్లే వీటిని మానినట్టు చెప్పారు.
‘‘నాకు లతను పరిచయం చేసిన వై జీ మహేంద్రన్ కు జీవితాంతం రుణపడి ఉంటాను. నేను కండక్టర్ గా ఉన్న రోజుల్లో ప్రతి రోజూ మద్యం తాగేవాడిని. రోజూ ఎన్ని సిగరెట్లు తాగేవాడినో లెక్కే ఉండేది కాదు. మాంసాహారంతోనే రోజు మొదలు పెట్టేవాడిని. రోజూ కనీసం రెండు సార్లు మాంసాహార భోజనం చేసేవాడిని. ఆ సమయంలో శాకాహారులను చూసి బాధపడేవాడిని. కానీ, ఈ మూడూ చాలా ప్రమాదకరమైన కాంబినేషన్.
ఈ మూడు అలవాట్లను దీర్ఘకాలం పాటు కొనసాగించిన వారు 60 ఏళ్ల తర్వాత ఆరోగ్యకరమైన జీవితం సాగించలేరు. ఈ విషయంలో నా భార్య లత పాత్ర కీలకం. ఆమె తన ప్రేమతో నేను వీటిని మానేలా చేసింది. క్రమశిక్షణతో జీవించేలా నన్ను మార్చింది’’అని రజనీకాంత్ సభలో వివరించారు.