Amazon: అమెజాన్ లో కొనసాగుతున్న ‘కాస్ట్ కటింగ్’
- 18,000 మంది ఉద్యోగులను తొలగించిన సంస్థ
- ఇప్పుడు ఇతర వ్యయ నియంత్రణ చర్యలపై దృష్టి
- కాలిఫోర్నియాలో ఖరీదైన ఆఫీస్ స్థలం అమ్మకానికి చర్చలు
ప్రముఖ అంతర్జాతీయ రిటైల్ సంస్థ అమెజాన్ తన వ్యయ నియంత్రణ చర్యలను (కాస్ట్ కటింగ్) కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ 18,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు ఇతర పొదుపు చర్యలపైనా దృష్టి సారించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు పెరిగిపోవడం తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, యూరప్ ఆర్థిక మాంద్యం ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో అమెజాన్ వ్యయాలను తగ్గించుకునే చర్యలకు ప్రాధాన్యం ఇస్తోంది.
మీ దగ్గర డబ్బులు ఉంటే వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలని, వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్ తదితర ఖరీదైన గృహోపకరణాల కొనుగోలును వాయిదా వేసుకోవాలంటూ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఇటీవలే సలహా కూడా ఇచ్చారు. తాజాగా ఈ సంస్థ కాలిఫోర్నియాలో ఖాళీగా ఉన్న కార్యాలయ భవనాన్ని విక్రయించాలని చూస్తున్నట్టు బ్లూంబర్గ్ సంస్థ వెల్లడించింది. ఈ ఆఫీస్ వసతిని అమెజాన్ 16 నెలల కిందటే కొనుగోలు చేసింది. 2021 అక్టోబర్ లో 123 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.1,008 కోట్లు) అమెజాన్ దీన్ని కొనుగోలు చేసింది.
అనంతరం వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు డెవలపర్ కు ఇచ్చింది. దీన్ని విక్రయించేందుకు ఇప్పుడు అమెజాన్ చర్చలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. దీన్ని అమెజాన్ ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. మెట్రో కార్పొరేషన్ సెంటర్ సైట్ ను విక్రయించే అవకాశాన్ని పరిశీలించాలని నిర్ణయించినట్టు చెప్పారు.