Narendra Modi: ప్రతిపక్షాల విమర్శలపై విద్యార్థి ప్రశ్న.. ‘ఔట్ ఆఫ్ సిలబస్’ అన్న మోదీ

pm narendra modi pariksha pe charcha

  • కష్టపడే వాళ్లు, నిజాయతీపరులు.. విమర్శల గురించి పట్టించుకోవాల్సిన పని లేదన్న ప్రధాని
  • కోరుకున్నది సాధించేందుకు కృషి చేయాలని సూచన
  • విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చ’

ప్రధాని నరేంద్ర మోదీ 2018 నుంచి ‘పరీక్షా పే చర్చ’ నిర్వహిస్తున్నారు. పరీక్షలకు ముందు విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టేందుకు, ఆత్మవిశ్వాసం నింపేందుకు ఉద్దేశించిన కార్యక్రమమిది. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ఆరో ఎడిషన్ లో ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు మోదీ ఇచ్చిన సమాధానం నవ్వులు పూయించింది. ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చే విమర్శలను ఎలా ఎదుర్కొంటారని ఓ స్టూడెంట్ అడిగాడు. దీంతో ‘ఇది ఔట్ ఆఫ్ సిలబస్’ అని ప్రధాని చమత్కరించారు. 

‘‘ఈ ప్రశ్న సిలబస్ లో లేదు. అయితే విమర్శ అనేది.. సుసంపన్న ప్రజాస్వామ్యం కోసం జరిగే ‘శుద్ధి యజ్ఞం’ అని నేను నమ్ముతాను’’ అని మోదీ బదులిచ్చారు. విమర్శలకు, నిందలకు మధ్య ఉన్న తేడాను కూడా వివరించారు. ‘‘మీరు కష్టపడే వారు, నిజాయతీపరులైతే.. విమర్శల గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అవే మీ బలం అవుతాయి. ఆలోచించండి.. విశ్లేషించండి.. పనిచేయండి.. ఆపైన మీరు కోరుకున్నది సాధించేందుకు కృషి చేయండి’’ అని చెప్పారు. ఈ సందర్భంగా మార్కుల విషయంలో అనవసర ఒత్తిడికి గురికావద్దని, కేవలం లక్ష్యంపై దృష్టి పెట్టాలని సూచించారు.

సమయ పాలనపైనా స్టూడెంట్లకు ప్రధాని పలు సూచనలు చేశారు. ‘‘సమయపాలన కేవలం పరీక్షలకు మాత్రమే కాదు.. రోజు వారీ జీవితంలో కూడా చాలా ముఖ్యం. ఒక్కసారి మీ అమ్మను గమనించండి.. మీ సమయాన్ని సరిగ్గా ఎలా వినియోగించుకోవాలో తెలుస్తుంది’’ అని చెప్పారు. ‘‘కొందరు విద్యార్థులు పరీక్షల్లో చీటింగ్ చేసేందుకు క్రియేటివిటీ ఉపయోగిస్తారు. వారంతా తమ సమయాన్ని, క్రియేటివిటీని మంచి పద్ధతిలో ఉపయోగిస్తే.. గొప్ప విజయాన్ని అందుకుంటారు. జీవితంలో షార్ట్ కట్స్ ను ఎన్నడూ ఎంచుకోవద్దు’’ అని సూచించారు.

ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు 38 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఇందులో స్టేట్ బోర్డు సిలబస్ ఉన్న విద్యార్థులు 16 లక్షల మందికి పైనే ఉన్నారు.

  • Loading...

More Telugu News