Virat Kohli: టెస్టుల్లోనూ కోహ్లీ చెలరేగాలి: గంగూలీ
- ఇండియన్ క్రికెట్ విరాట్ పైనే ఆధారపడి ఉందన్న గంగూలీ
- టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా, ఆస్ట్రేలియా ఆడాలని కోరుకుంటున్నట్లు వెల్లడి
- వన్డే ప్రపంచ కప్ దాకా ఇప్పుడున్న జట్టునే కొనసాగించాలని సూచన
ఫామ్ ను కోల్పోయి కొన్ని నెలలపాటు ఇబ్బంది పడిన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. మళ్లీ గాడిలో పడ్డాడు. ఇటీవల పాత కోహ్లీని గుర్తు చేస్తున్నాడు. టీ20లు, వన్డేల్లో చెలరేగుతున్నాడు. అయితే టెస్టుల్లో కోహ్లీ మరింత దూకుడుగా ఆడాలని బీసీసీఐ మాజీ బాస్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సూచించాడు. గంగూలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కోహ్లీపైనే ఇండియన్ క్రికెట్ ఆధారపడి ఉందని, అందుకే టెస్టుల్లోనూ అతడు చెలరేగిపోవాలని సూచించాడు.
‘‘కోహ్లీ బాగానే ఆడుతున్నాడు. బంగ్లాదేశ్, శ్రీలంకతో మంచి ప్రదర్శన ఇచ్చాడు. అయితే టెస్ట్ క్రికెట్ లోనూ అతడు బాగా ఆడాలి. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ అతడిపైనే ఆధారపడి ఉంది. ఆస్ట్రేలియా సిరీస్ త్వరలోనే ఉంది. ఇది గొప్ప అవకాశమని అనుకుంటున్నా’’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా, ఆస్ట్రేలియా ఆడాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు.
వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా అవకాశాలపై స్పందిస్తూ.. జట్టుపై తనకు నమ్మకముందని చెప్పాడు. ‘‘టీమిండియా బలంగా ఉంది. మన దేశంలో ఎంతో మంది క్రికెట్ ఆడుతున్నారు. అయితే తీవ్ర పోటీ వల్ల అందులో సగం మందికి జాతీయ జట్టులో చోటు దక్కడం లేదు. ప్రపంచ కప్ దాకా ఇదే జట్టును కొనసాగించాలని సెలక్టర్లు, రాహుల్ ద్రావిడ్ ను కోరుతున్నా. ప్రపంచకప్ లో పెద్దగా ఆందోళన పడాల్సిన పనిలేదు.. బాగా ఆడితే చాలు’’ అని చెప్పాడు.