Nara Lokesh: వారాహి ఆగదు.. ఈ యువగళం ఆగదు: కుప్పంలో నారా లోకేశ్
- కుప్పంలో లోకేశ్ భారీ బహిరంగ సభ
- రాష్ట్రంలో వింత పరిస్థితులు ఉన్నాయన్న టీడీపీ యువనేత
- విపక్షాలను అడ్డుకునేందుకు జీవో నెం.1 తీసుకువచ్చారని విమర్శ
- ఎవరూ పోరాటాలు చేయకూడదనే జీవో తెచ్చారని ఆగ్రహం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర నేడు ఘనంగా ప్రారంభమైంది. కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి లోకేశ్ ఉత్సాహంగా ప్రసంగించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో వింత పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఈ ఏ1 జాదూరెడ్డి ప్రతిపక్షాలను అడ్డుకునేందుకు జీవో నెం.1 తీసుకువచ్చాడని విమర్శించారు. ప్రతిపక్షాలు ప్రజల సమస్యలపై పోరాడకూడదని, కలిసికట్టుగా ఎవరూ ముందుకు పోకూడదని ఈ జీవో తీసుకువచ్చారని మండిపడ్డారు. ఈ సందర్భంగా లోకేశ్ జనసేనాని పవన్ కల్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
"మనమే కాదు... ప్రజల పక్షాన పోరాడుతున్న పవన్ కల్యాణ్ కూడా బయటికి అడుగుపెట్టకూడదంట. పవన్ కల్యాణ్ పర్యటనల కోసం తయారుచేయించుకున్న వారాహి వాహనానికి ఏపీలో అనుమతులు ఇవ్వరంట. ఏ1 సైకోరెడ్డికి ఒకటే చెబుతున్నా.... నీ జీవో నెం.1ని మడతపెట్టి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో! వారాహి ఆగదు... ఈ యువగళం ఆగదు. యువత తరఫున పోరాడేందుకే యువగళం. మమ్మల్ని మీరు ఆపలేరు. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోతాం.
భయం అనేది నా బయోడేటాలో లేదు. నాలో మానవత్వం ఉంది, మంచితనం ఉంది. మంచి కోసం పోరాడే దమ్ముంది. అందుకే నన్ను ఆశీర్వదించండి... నన్ను దీవించండి. 400 రోజుల పాదయాత్రలో ఇది తొలిరోజు. ఇవాళ 11.03 గంటలకు పాదయాత్ర ప్రారంభించాను. నాతో కలిసి నడవండి... ఈ జాదూరెడ్డిని ఇంటికి పంపిద్దాం. ఈ యువగళం మన బలం... ప్రజాబలం. 2024లో చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం" అంటూ నారా లోకేశ్ పిలుపునిచ్చారు.