tigers: ప్రపంచంలోనే పులులకు రాజధాని భారత్
- 70 శాతం పులులు భారత్ లోనే
- 76,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 2,967 పెద్ద పులులు
- దేశవ్యాప్తంగా 53 పులుల అభయారణ్యాలు
- సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
ఈ ప్రపంచంలో పులులు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయని అనుకుంటున్నారు..? ఆఫ్రికా అని అనుకుంటుంటే అది తప్పు. ప్రపంచంలో 70 శాతం పెద్ద పులులు భారత్ లోనే ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర సర్కారు స్వయంగా సుప్రీంకోర్టుకు తెలిపింది. పులుల వేట పట్ల కఠినంగా వ్యవహరిస్తూ, వాటి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలతో ఇది సాధ్యమైందని చెప్పింది. పెద్ద పులుల సంతతి మన దేశంలో ఏటా 6 శాతం పెరుగుతూ పోతున్నట్టు తెలిపింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది.
మన దేశం 2018 లోనే పెద్ద పులుల సంఖ్యను రెట్టింపునకు చేర్చుకుంది. పులుల సంరక్షణ విషయంలో నాలుగేళ్ల ముందుగానే నిర్దేశిత లక్ష్యాన్ని సాధించినట్టు కేంద్ర సర్కారు తెలిపింది. అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ఈ మేరకు సుప్రీంకోర్టుకు వివరాలు అందించారు. మన దేశంలో పులుల అభయారణ్యాల సంఖ్య 53కు చేరుకుంది. దేశవ్యాప్తంగా వీటి పరిధిలో 76,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 2,967 పులులు జీవిస్తున్నాయి. పెద్ద పులుల కృత్రిమ సంతానోత్పత్తికి అవకాశం లేదని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఈ అఫిడవిట్ లో పేర్కొంది. వాటికి మన దేశంలో ఆమోదం లేదని వివరించింది.