Q fever: హైదరాబాద్ లో కొత్త రకం జ్వరం.. క్యూ ఫీవర్ కేసులను గుర్తించిన వైద్యాధికారులు
- ఇప్పటి వరకు నగరంలో ఐదుగురిలో ఈ వ్యాధిని గుర్తించిన అధికారులు
- జంతువుల ద్వారా మనుషులకు సోకుతుందని వెల్లడి
- కబేళాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్న వెటర్నరీ ఆఫీసర్
హైదరాబాద్ లో కొత్త రకం జ్వరం విజృంభిస్తోందని, జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు ప్రజలను హెచ్చరించారు. క్యూ ఫీవర్ గా పిలిచే ఈ వ్యాధి ఇప్పటికే పలువురిలో బయటపడిందని చెప్పారు. జంతువుల ద్వారా ఈ వ్యాధి సోకుతుందని, కబేళాలకు దూరంగా ఉండాలని సూచించారు. నగరానికి చెందిన 250 మంది మాంసం విక్రేతలకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురిలో ఈ క్యూ ఫీవర్ ను గుర్తించినట్లు నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ (ఎన్ఆర్ సీఎం) నిర్ధారించింది.
ఈ క్యూ ఫీవర్ అంటువ్యాధి అని వైద్యాధికారులు చెప్పారు. మేకలు, గొర్రెలు, పశువులు.. తదితర జంతువుల్లో కనిపించే కోక్సియెల్లా బర్నెటి అనే బ్యాక్టిరియా ద్వారా వ్యాపిస్తుందని వివరించారు. వ్యాధి సోకిన పక్షుల నుంచి, వ్యాధి బారిన పడ్డ జంతువులు పీల్చి వదిలే గాలి ద్వారా కూడా మనుషులకు అంటుకుంటుందని తెలిపారు. క్యూ ఫీవర్ తో బాధపడుతున్న వ్యక్తులలో జ్వరం, చలి, అలసట, కండరాల నొప్పితో పాటు ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెప్పారు.
ప్రస్తుతానికి కొద్దిమందికే ఈ వ్యాధి సోకిందని, ఆందోళన పడాల్సిన అవసరంలేదని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్ చెప్పారు. అయితే, పరిశుభ్రత పాటిస్తూ, మాస్కులు వాడాలని ప్రజలకు సూచించారు. పశువుల కాపరులకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువని, వారి ద్వారా ఇతరులకు ఇది అంటుకుంటుందని వివరించారు.