YS Avinash Reddy: అవినాశ్ రెడ్డి లాయర్ ను అనుమతించని సీబీఐ అధికారులు.. కొనసాగుతున్న విచారణ
- కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అవినాశ్ విచారణ
- అవినాశ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్న సీబీఐ అధికారులు
- అవసరమైతే అవినాశ్ ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారిస్తోంది. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో ఆయనను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. ఈ రోజు విచారణ ముగిసిన తర్వాత అవసరమైతే మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది.
మరోవైపు, తనతో పాటు తన లాయర్ ను కూడా విచారణ సమయంలో అనుమతించాలన్న అవినాశ్ విన్నపాన్ని సీబీఐ అధికారులు తిరస్కరించారు. అవినాశ్ లాయర్ ను కార్యాలయం బయటే ఆపేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ కార్యాలయానికి వచ్చిన అవినాశ్ నేరుగా లోపలకు వెళ్లిపోయారు. మరోవైపు అంతకు ముందే అక్కడకు చేరుకున్న వైసీపీ శ్రేణులను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు.