Maruti Suzuki: ఇన్నోవా హైక్రాస్ తరహాలో మారుతి సుజుకి నుంచి సరికొత్త ఎంపీవీ
- సుజుకి, టయోటా మధ్య గ్లోబర్ పార్ట్ నర్ షిప్
- పరస్పరం మోడళ్ల మార్పిడి
- ఇప్పటికే మారుతి బ్రెజా, బాలెనో కార్లను తీసుకున్న టయోటా
- అర్బన్ క్రూయిజర్, గ్లాంజా పేరిట విక్రయాలు
- ఇప్పుడు మారుతి సుజుకి వంతు
జపాన్ కార్ల తయారీ దిగ్గజం సుజుకి భారత్ కు చెందిన మారుతి సంస్థతో జట్టుకట్టి మారుతి సుజుకి పేరిట ప్రపంచవ్యాప్తంగా విక్రయాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన విషయం, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే... జపాన్ కే చెందిన మరో కార్ల తయారీ దిగ్గజం టయోటాతో సుజుకి సంస్థకు ఓ గ్లోబల్ పార్ట్ నర్ షిప్ ఒప్పందం ఉంది.
ఈ ఒప్పందం ప్రకారం... ఒకరి మోడళ్లను మరొకరు తమ బ్రాండ్ పేరిట విక్రయాలు జరుపుకోవచ్చు. ఉదాహరణకు మారుతి సుజుకి 'బాలెనో' కారును టయోటా 'గ్లాంజా' పేరిట విక్రయిస్తోంది. అంతేకాదు, మారుతి సుజుకికి చెందిన 'విటారా బ్రెజా' మోడల్ ను టయోటా 'అర్బన్ క్రూయిజర్' పేరుతో అమ్మకాలు సాగిస్తోంది.
బాలెనో-గ్లాంజా... విటారా బ్రెజా-అర్బన్ క్రూయిజర్ వాహనాలను పక్కపక్కనే పెట్టి చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం బ్రాండింగ్ మారుతుంది తప్ప, వాటి డిజైన్ లో తేడా లేదన్న విషయం తెలుసుకోవచ్చు.
ఇక అసలు విషయానికొస్తే... టయోటా సంస్థ తన ఫేమస్ ఇన్నోవా మోడల్ లో 'హైక్రాస్' పేరిత కొత్త వెర్షన్ తీసుకువస్తోంది. ఇప్పుడీ 'ఇన్నోవా హైక్రాస్' ను దత్తత తీసుకునేందుకు మారుతి సుజుకి సిద్ధమైంది. 'హైక్రాస్' మోడల్ తలపించే సరికొత్త మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) ను త్వరలోనే మారుతి సుజుకి మార్కెట్లోకి తీసుకురానుంది.
ఇప్పటికే మారుతి సుజుకి సంస్థ... ఇన్నోవా కారు తరహాలో 'ఎర్టిగా' మోడల్ ను తీసుకురావడం తెలిసిందే. టయోటా 'హైక్రాస్' మోడల్ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 2.0 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ వేరియంట్లలో వస్తోంది. మరి మారుతి సుజుకి తీసుకువచ్చే కొత్త ఎంపీవీకి ఏం పేరు పెడతారన్న దానిపై ఆటోమొబైల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.