Andhra Pradesh: ఏపీ పోలీసులమంటూ దారి దోపిడీలు.. బెంగళూరులో ముగ్గురి అరెస్ట్
- బెంగళూరులో ఇద్దరు వ్యాపారులను బెదిరించి రూ. 80 లక్షల దోపిడీ
- ఏపీ, కర్ణాటకలో 80కిపైగా కేసులు
- బెంగళూరులోని ఓ హోటల్‌లో జూదం
- కోటి రూపాయలు గెల్చుకుని కొన్ని గంటల్లోనే ఓడిన వైనం
- మిగిలిన సొమ్ముతో పరారీ
- చిత్తూరు జిల్లాలో అరెస్ట్
ఏపీ పోలీసులమంటూ దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురిని బెంగళూరు పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. నిందితులను ఏపీకి చెందిన బత్తుల శివరామకృష్ణ యాదవ్ (19), షేక్ చెంపతి లాల్ బాషా, షేక్ చెంపతి జకీర్ (27)గా గుర్తించారు. వీరు ముగ్గురూ కలిసి బెంగళూరుకు చెందిన కుమారస్వామి, చందన్ అనే వ్యాపారులను బెదిరించి రూ. 80 లక్షలు దోచుకున్నారు. నిందితుల నుంచి ఆ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో దారి దోపిడీలు, దొంగతనాలు, ఎర్రచందనం తరలింపు తదితర 80కిపైగా కేసులు వీరిపై నమోదైనట్టు పోలీసులు తెలిపారు. దోచుకున్న నగదుతో బెంగళూరు మేజెస్టిక్ సమీపంలోని ఓ హోటల్‌లో జూదం ఆడారని, కోటి రూపాయలు గెల్చుకుని కొన్ని గంటల్లోనే మళ్లీ ఆ సొమ్మును ఓడిపోయారని పేర్కొన్నారు. మిగిలిన సొమ్ముతో పరారైన వీరిని చిత్తూరు జిల్లాలో అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.