BJP: తెలంగాణపై బీజేపీ త్రిముఖ వ్యూహం.. మోదీతో 5 సభలు!
- తెలంగాణపై దృష్టి సారించిన కేంద్ర నాయకత్వం
- యూపీ ఎన్నికల్లో ఫలించిన త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయం
- రాష్ట్రంలో 11వేల కార్నర్ సమావేశాలు, భారీ సభలకు కార్యాచరణ
తెలంగాణపై బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా త్రిముఖ వ్యూహం రచించింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతంగా అమలు చేసిన ఈ వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను రంగంలోకి దించనుంది. పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో సమావేశాలు, భారీ బహిరంగ సభలకు వీరు హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే నాలుగైదు బహిరంగ సభలకు ప్రధాని మోదీ హాజరయ్యేలా బీజేపీ నాయకత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.
ఇందులో భాగంగా ప్రతి కార్యక్రమం 15 రోజులపాటు కొనసాగేలా కార్యాచరణ సిద్ధం చేసింది. అలాగే, ఫిబ్రవరి 10 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 11 వేల కార్నర్ మీటింగ్‌లు నిర్వహించనుంది. ఇక, మూడు, నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలను కలిపి ఒక క్లస్టర్‌గా బీజేపీ గుర్తించింది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలను నాలుగు క్లస్టర్లుగా విభజించింది. క్లస్టర్ స్థాయిలో భారీ సభలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరకానున్నారని బీజేపీ చెబుతోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించేలోగా ప్రధాని మోదీ నాలుగు నుంచి ఐదుసార్లు రాష్ట్రంలో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. రెండు పార్లమెంటు సెగ్మెంట్లను కలిపి నిర్వహించే సభలకు అమిత్‌షా, జేపీ నడ్డా హాజరవుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.