Chintakayala Vijay: పార్టీ నేతలు, లాయర్లతో కలిసి సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్
- గత ఏడాది 'భారతి పే' పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్ట్
- ఐటీడీపీ ఇన్చార్జ్ విజయ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడీ
- విచారణ సమయంలో లాయర్ ను అనుమతించాలని సీఐడీకి కోర్టు ఆదేశాలు
టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు, ఐటీడీపీ ఇన్చార్జ్ చింతకాయల విజయ్ మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ నేతలు, లాయర్లతో కలిసి ఆయన సీఐడీ విచారణకు హాజరయ్యారు. సీఎం జగన్ భార్య వైఎస్ భారతి లక్ష్యంగా గత ఏడాది సెప్టెంబర్ లో సోషల్ మీడియాలో 'భారతి పే' పేరుతో ఒక పోస్ట్ వైరల్ అయింది. ఐటీడీపీ ద్వారానే ఈ పోస్ట్ సర్కులేట్ అయిందంటూ... విజయ్ పై ఏపీ సీఐడీ అధికారులు ఐపీసీ సెక్షన్లు 419, 469, 153 ఏ, 505 (2), 102 బీ, రెడ్ విత్ 34, 66 (సీ) తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 2000ల కింద కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.
అయితే విచారణకు హాజరుకాకుండా కోర్టు నుంచి విజయ్ స్టే తెచ్చుకున్నారు. ఈ నెల 27న ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, ఆ రోజున విచారణకు హాజరు కాలేనని మరోసారి ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు అనుమతితో ఈ రోజు ఆయన విచారణకు హాజరయ్యారు. విజయ్ తో పాటు ఆయన లాయర్ ను కూడా అనుమతించాలని సీఐడీ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, సీఐడీ కార్యాలయానికి విజయ్ వచ్చిన నేపథ్యంలో అక్కడకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఇంకోవైపు, పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.