Team India: ప్రపంచ కప్ గెలిచిన భారత అమ్మాయిలకు భారీ రివార్డు

BCCI announces Rs 5 crore reward for victorious Womens U 19 T20 squad

  • రూ. 5 కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ
  • బుధవారం అహ్మదాబాద్ స్టేడియంలో క్రికెటర్లను సత్కరించనున్న బోర్డు
  • స్వయంగా అభినందించనున్న ప్రధాని నరేంద్ర మోదీ!

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌ నెగ్గిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఈ విజయానికి పురస్కారంగా యంగ్‌ ఇండియాకు రూ. 5 కోట్లు అందించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఇది మనమంతా గర్వించదగ్గ తరుణం. ఈ విజయం దేశంలో మహిళల క్రికెట్‌కు ఇది మరింత తోడ్పాటునందిస్తుంది. ఈ విజయంలో భాగస్వాములైన ప్లేయర్లు, జట్టు కోచింగ్ సిబ్బందికి రూ. 5 కోట్లు ఇవ్వనున్నాం’ అని షా పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ప్రపంచ విజేతగా నిలిచింది.

మహిళల క్రికెట్ లో ఏ స్థాయిలో అయినా భారత్ కు ఇదే తొలి ప్రపంచ కప్ కావడం విశేషం. వరల్డ్‌ కప్‌ చేజిక్కించుకొని తిరిగి వస్తున్న షెఫాలీ వర్మ బృందాన్ని బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మూడో టీ20 మ్యాచ్ కు జై షా ఆహ్వానించారు. మ్యాచ్ సందర్భంగా యువ క్రికెటర్లను ఘనంగా సత్కరిస్తామని తెలిపారు. కాగా, ప్రపంచ విజేతలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా కలిసి అభినందిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News