Andhra Pradesh: తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయ్.. సింహంలా మీ బిడ్డ ఒక్కడే నడుస్తున్నాడు: సీఎం జగన్

AP CM YS Jagan To Release Jagananna Chedodu 2023 Funds in vinukonda

  • రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందన్న ముఖ్యమంత్రి
  • వెన్నుపోట్లు, మోసాలకు పాల్పడే వారిని ఒంటరిగా ఎదుర్కొంటున్నట్లు వెల్లడి
  • తనకు ఎవరితోనూ పొత్తుల్లేవని, మిమ్మల్ని తప్ప తాను ఎవరినీ నమ్ముకోలేదని వివరణ
  • దేవుడి దయ, మీ చల్లని దీవెనలతోనే ముందుకెళుతున్నానని స్పష్టం చేసిన జగన్  
  • పల్నాడు జిల్లాలో జరిగిన ‘జగనన్న చేదోడు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగం

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పేదవారికి, పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఈ యుద్ధంలో వెన్నుపోట్లు, మోసాలకు పాల్పడే వారిని మీ బిడ్డ (జగన్) ఒంటరిగా ఎదుర్కొంటున్నాడని చెప్పారు. ఇచ్చిన మాట మీద నిలబడే తనకు ముసలాయన (చంద్రబాబు) మాదిరి ఈనాడు తోడుగా ఉండకపోవచ్చని, ఆంధ్రజ్యోతి అండగా నిలబడకపోవచ్చని, టీవీ 5 తోడుగా ఉండకపోవచ్చని, దత్తపుత్రుడు తనకోసం మైకు పట్టుకోకపోవచ్చని జగన్ అన్నారు. అయితే, తాను రాష్ట్రంలోని ప్రజలను నమ్ముకుని వారితో యుద్ధం చేస్తున్నానని జగన్ చెప్పారు.

నిరుపేద వర్గాలను నమ్ముకుని, వారికోసం పోరాడుతున్నానని వివరించారు. తనకు ఎవరితోనూ పొత్తుల్లేవని, తాను ఎవరినీ నమ్ముకోలేదని తేల్చిచెప్పారు. తనకు ఉన్నదల్లా దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మాత్రమేనని జగన్ స్పష్టం చేశారు. ‘తోడేళ్లందరూ ఒక్కటవుతున్నారు.. అయినా భయపడకుండా మీ బిడ్డ సింహంలా ఒక్కడే ఎదురెళ్లుతున్నాడు. మిమ్మల్ని నమ్ముకున్నాడు కాబట్టే మీ బిడ్డ ధైర్యంగా ముందుకు అడుగేస్తున్నాడు’ అని జగన్ చెప్పారు.

మీ దీవెనలు బిడ్డపై ఉండాలని కోరుకుంటున్నట్లు జగన్ చెప్పారు. ముందు ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టేలా ఆశీర్వదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని వివరించారు. సోమవారం పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన ‘జగనన్న చేదోడు’ మూడో విడత ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 'జగనన్న చేదోడు' పథకం లబ్దిదారులకు చెందిన 3,30,145 బ్యాంకు ఖాతాల్లో రూ.330.15 కోట్లను బటన్ నొక్కి జమ చేశారు. రాష్ట్రంలోని చిన్న తరహా వ్యాపారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పథకమే జగనన్న చేదోడు.. ఇందులో భాగంగా రాష్ట్రంలోని దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఏటా రూ.10 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది.

  • Loading...

More Telugu News