Parliament: రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
- జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
- ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
- నేడు అఖిలపక్ష సమావేశం.. అన్ని పార్టీలకు ఆహ్వానం
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు రేపు (జనవరి 31) తెర లేవనుంది. నరేంద్ర మోదీ సర్కారుకు ఇదే పూర్తిస్థాయి చివరి బడ్జెట్ కానుండడంతో, రేపట్నించి జరిగే పార్లమెంటు సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఈసారి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కొనసాగుతాయి. రెండో విడత మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్ 6తో ముగుస్తాయి.
ఇక, ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కరోనా సంక్షోభం దాదాపు ముగిసిన నేపథ్యంలో, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ఆర్థికమంత్రి ఎలాంటి ఉపశమనాలు కలుగజేస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది.
కాగా, రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనుండగా, కేంద్రం నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు అఖిలపక్ష సమావేశానికి రావాలంటూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కార్యాలయం వివిధ పార్టీలకు ఆహ్వానాలు పంపింది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో, దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.