Suicide Bomb Attack: పాకిస్థాన్ మసీదులో ఉగ్రదాడి... 46 మంది మృతి
- పెషావర్ సిటీలో మధ్యాహ్నం ప్రార్థన సమయంలో బాంబు పేలుడు
- 150 మందికి పైగా గాయాలు
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
పాకిస్థాన్ లో ఉగ్రవాద దాడి జరిగింది. మసీదులో బాంబు పేలడంతో 46 మంది చనిపోయారు. 150 మందికి పైగా గాయపడ్డారు. పెషావర్ సిటీలోని స్థానిక పోలీసు కార్యాలయంలో ఉన్న మసీదులో సోమవారం మధ్యాహ్నం ప్రార్థనలు చేసేందుకు 260 మంది దాకా వచ్చారు. ప్రార్థనలు జరుగుతుండగానే బాంబు పేలింది.
పేలుడు ధాటికి మసీదు పైకప్పు దెబ్బతింది. గోడ ఒకవైపు పూర్తిగా కూలిపోయింది. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కూలిన శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఇది ఆత్మాహుతి దాడి కావచ్చని అనుమానిస్తున్నారు.
గతేడాది మార్చిలో పెషావర్ లోనే షియాలకు చెందిన మసీదుపై ఐసిస్ ఆత్మాహుతి దాడి చేయగా.. 64 మందికి పైగా చనిపోయారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులకు దగ్గరగా ఉండటంతో తెహ్రిక్-ఇ-తాలిబన్ (టీటీపీ), ఐసిస్ ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు.
పేలుళ్ల ఘటనకు తమదే బాధ్యతని అని తెహ్రీక్-ఐ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) సంస్థ ప్రకటన చేసింది.