Murali Vijay: అంతర్జాతీయ క్రికెట్ కు మురళీ విజయ్ వీడ్కోలు
- ట్విట్టర్ ద్వారా ప్రకటించిన విజయ్
- బీసీసీఐ, సహచరులు, కోచ్ లకు థ్యాంక్స్ చెబుతూ సుదీర్ఘ పోస్ట్
- 2002 నుంచి 2018 దాకా సాగిన ప్రయాణం తన జీవితంలో అద్భుతమని వెల్లడి
అంతర్జాతీయ క్రికెట్ కు సీనియర్ బ్యాట్స్ మన్ మురళీ విజయ్ విడ్కోలు పలికాడు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించాడు. తనకు అవకాశాలు ఇచ్చిన బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్, చెంప్లాస్ట్ సన్మార్ లకు కృతజ్ఞతలు తెలియజేశాడు. 2002 నుంచి 2018 దాకా సాగిన ప్రయాణం తన జీవితంలోనే అద్భుతమని చెప్పాడు. తనకు సహకరించిన టీమ్ మేట్స్, కోచ్ లు, మెంటార్లు, సపోర్ట్ స్టాఫ్ కు ధన్యవాదాలు చెప్పాడు.
టెస్టుల్లో రెగ్యులర్ ఓపెనర్ గా రాణించిన విజయ్.. 2018 సీజన్ లో సరిగ్గా ఆడలేదు. దీంతో జట్టు నుంచి చోటు కోల్పోయాడు. చివరి సారిగా 2018లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఆడాడు. పోటీ తీవ్రంగా ఉండటం, వయసు 38 ఏళ్లకు చేరుకోవడంతో క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.
తన కెరియర్ లో 61 మ్యాచ్ లు ఆడిన మురళీ విజయ్.. 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు సాధించాడు. 38.28 సగటుతో 3,982 పరుగులు చేశాడు. తమిళనాడుకు చెందిన విజయ్.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. రెండు సెంచరీలు కొట్టాడు. మొత్తం 106 మ్యాచ్ లలో 2,619 పరుగులు చేశాడు.