Gas Cylinders: గ్యాస్ సిలిండర్ డెలివరీకి అదనంగా డబ్బులు చెల్లించొద్దు: ఏపీ పౌరసరఫరాల శాఖ
- నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవన్న కమిషనర్
- డబ్బులు అడిగితే కాల్‌సెంటర్లకు ఫిర్యాదు చేయాలని సూచన
- నిర్ణీత పరిధికి దూరంగా ఉంటే కనుక డబ్బులు చెల్లించాల్సిందే
గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే వారికి అదనంగా రుసుము చెల్లించాల్సిన పని లేదని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. రసీదుపై ఎంత ఉంటే అంతే చెల్లించాలని, అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదని అన్నారు. నిర్ణీత పరిధిలో ఉన్నప్పటికీ కొందరు డీలర్లు, డెలివరీ బాయ్‌లు అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే జిల్లా పౌరసరఫరాల అధికారులు, ఇంధన సంస్థల మార్కెటింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలని సూచించారు. తమ కాల్ సెంటర్ 1967, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలోని 1800 2333555 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు.
కాగా, అధీకృత డీలర్ కార్యాలయం నుంచి వినియోగదారుడి నివాసం 5 కిలోమీటర్ల లోపు ఉంటే అదనంగా రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు. 5 నుంచి 15 కిలోమీటర్ల లోపు ఉంటే కనుక రూ. 20, 15 కిలోమీటర్ల పైన ఉంటే రూ. 30 చెల్లించాలి.