Karthik: 'యమలీల' రీమేక్ తో ఆస్తులు అమ్ముకోవలసి వచ్చిందట!
- అప్పట్లో స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్న కాట్రగడ్డ ప్రసాద్
- తమిళంలో 'యమలీల' రీమేక్ చేశానన్న నిర్మాత
- ఆ సినిమా వలన తట్టుకోలేని నష్టాలు వచ్చాయని వెల్లడి
- ఆస్తులు అమ్మేసి అప్పులు తీర్చానని వివరణ
ఒకప్పుడు అగ్రనిర్మాతల జాబితాలో కనిపించిన పేరు కాట్రగడ్డ ప్రసాద్. ఆ తరువాత కాలంలో ఆయన సినిమాల నిర్మాణానికి దూరంగా ఉంటూ వచ్చారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నేను ఎక్కువగా సుమన్ తో సినిమాలు చేస్తూ వెళ్లాను. జగపతిబాబు కూడా నాకు ఎప్పుడంటే అప్పుడు డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉండేవాడు" అన్నారు.
"తెలుగులో 'యమలీల' సూపర్ హిట్ కావడంతో నేను తమిళ రీమేక్ హక్కులను తీసుకున్నాను. ఈ సినిమాను 'లక్కీమేన్' పేరుతో తమిళంలో కార్తీక్ .. సంఘవి .. మంజుల .. గౌండమణి .. సెంథిల్ ఇలా పెద్ద స్టార్స్ ను పెట్టి నిర్మించాను. ఒక రకంగా అప్పట్లోనే ఇది మల్టీ స్టారర్ సినిమా అని చెప్పుకోవాలి. ఆ సినిమా వలన తట్టుకోలేనంత నష్టం వచ్చింది" అని చెప్పారు.
"తమిళనాడులో యమధర్మరాజుకు సంబంధించిన సినిమాలు ఆడవు అనే విషయం, 'లక్కీమేన్' రిలీజ్ తరువాత నాకు తెలిసింది. ఈ సినిమా వలన చేసిన అప్పులు తీర్చడానికి 3 చోట్ల ఉన్న నా ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది. అందువలన ఆ తరువాత నేను గ్యాప్ తీసుకోవలసి వచ్చింది" అని చెప్పుకొచ్చారు.