Jagan: జగన్ పై దాడి కేసు... బాధితుడు జగన్ ను కూడా విచారణకు హాజరుపరచాలంటూ ఎన్ఐఏకు కోర్టు ఆదేశాలు
- జగన్ పై దాడి కేసును విచారించిన విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు
- బాధితుడు జగన్ కోర్టుకు రావాలని కోర్టు ఆదేశం
- జగన్ కోర్టుకు వచ్చేలా విక్టిమ్ షెడ్యూల్ ను రూపొందించాలని ఎన్ఐఏకు ఆదేశాలు
వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో నాడు జరిగిన దాడి కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. ఈ కేసు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో కొనసాగుతోంది. ఈరోజు విచారణ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణకు జగన్ ను కూడా హాజరుపరచాలని ఎన్ఐఏను ఆదేశించింది.
ఈ కేసులో తొలి సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్ పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ రాఘవ విచారణకు హాజరు కాకపోవడంతో కేసుకు సంబంధించి మొత్తం ట్రయల్ షెడ్యూల్ ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఇందులో విక్టిమ్ (బాధితుడు) షెడ్యూల్ కూడా ఉండాలని తెలిపింది. ఈ కేసులో బాధితుడు జగన్ కావడంతో... ఆయన కూడా కోర్టుకు వచ్చేలా షెడ్యూల్ ను రూపొందించాలని ఎన్ఐఏను జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసిన కోర్టు... ఆరోజు విచారణకు జగన్ రావాలని ఆదేశాలు జారీ చేశారు.