economy: భారత్ వృద్ధి కాస్త నెమ్మదించవచ్చు.. ఐఎంఎఫ్ అంచనా!

expecting slowdown in indian economy in 2023

  • ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై జనవరి అప్ డేట్ రిలీజ్ చేసిన అంతర్జాతీయ ద్రవ్య నిధి
  • 2023లో ప్రపంచ వృద్ధిలో 50 శాతం వాటా చైనా, భారత్ దేనని వెల్లడి
  • ఇండియాలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని రిపోర్ట్

వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) లో భారత ఆర్ధిక వృద్ధి కాస్త నెమ్మదించవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కీలక అంచనాలను వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన జనవరి అప్ డేట్ ను మంగళవారం విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదవుతుందని తెలిపింది. అదే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం 6.1కి పరిమితమవుతుందని చెప్పింది. 

ఇదే సమయంలో ప్రపంచ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.4 శాతంగా నమోదవుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2.9 శాతానికి పడిపోతుందని వెల్లడించింది. అదే 2024లో పెరిగి.. 3.1 శాతానికి చేరుతుందని అంచనా వేసింది.

‘‘ఇండియా విషయంలో అక్టోబర్ ఔట్ లుక్ తో పోలిస్తే.. మా అంచనాలేమీ మారలేదు. అయితే బాహ్య పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది భారత వృద్ధి కాస్త నెమ్మదించవచ్చు’’ అని అని చీఫ్ ఎకనమిస్ట్, ఐఎంఎఫ్ రీసెర్చ్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ పియర్రీ ఒలీవియర్ గౌరించస్ అభిప్రాయపడ్డారు. 2023లో ప్రపంచ వృద్ధిలో 50 శాతం వాటా చైనా, భారత్ దేనని చెప్పారు. అమెరికా, యూరప్ ప్రాంతాలు కలిసి కేవలం 10 శాతం మాత్రమే ప్రపంచ ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని వెల్లడించారు. 

2023లో చైనా జీడీపీ 5.2 శాతానికి పెరుగుతుందని, 2024 లో మాత్రం 4.5 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది. ఇక అమెరికా వృద్ధి 1.4 శాతానికి తగ్గిపోతుందని అంచనా వేసింది. భారత్ లో ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 శాతానికి తగ్గుతుందని, వచ్చే ఏడాది మరింత తగ్గి 4 శాతంగా నమోదవుతుందని వివరించింది.

  • Loading...

More Telugu News