YV Subba Reddy: విశాఖలో సీఎం ఎక్కడుంటారన్నది సమస్య కాదు: వైవీ సుబ్బారెడ్డి
- తాను విశాఖకు షిఫ్ట్ అవుతున్నానన్న సీఎం జగన్
- ఏప్రిల్ లోపు రాజధాని తరలింపు ఉంటుందన్న సుబ్బారెడ్డి
- అనేక భవనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడి
- విశాఖ నుంచే పరిపాలన జరుగుతుందని స్పష్టీకరణ
ఏపీ రాజధాని విశాఖేనని సీఎం జగన్ ఇవాళ ఢిల్లీలో తమ వైఖరిని బలంగా చాటగా, వైసీపీ నేతలు కూడా ఈ అంశంలో మరింత స్పష్టత నిస్తున్నారు.
టీటీడీ చైర్మన్, వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏప్రిల్ లోపు విశాఖకు రాజధాని తరలింపు ఉంటుందని వెల్లడించారు. రాజధాని మార్పుపై తాము విశాఖ గర్జన సభలోనే స్పష్టం చేశామని తెలిపారు. ఏప్రిల్ లోపు న్యాయపరమైన సమస్యలు ఓ కొలిక్కి వస్తాయని భావిస్తున్నామని, విశాఖ నుంచే పరిపాలన జరుగుతుందని చెప్పారు.
అయితే విశాఖ వస్తే ముఖ్యమంత్రి ఎక్కడుంటారన్నది సమస్య కాదని, అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. భీమిలి రోడ్డులో ఖాళీగా ఉన్న ఐటీ కంపెనీలను ప్రభుత్వ భవనాలుగా ఉపయోగించుకుంటామని తెలిపారు.
సెక్రటేరియట్ గా వినియోగించుకోదగిన భవనాలు కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయని వైవీ పేర్కొన్నారు. పైగా, ఉడాకు సంబంధించిన భవనాలు కూడా ఉన్నాయని వివరించారు.