Nirmala Sitharaman: కాసేపట్లో బడ్జెట్... రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్
- 2023-24 కేంద్ర బడ్జెట్ కు సర్వం సిద్ధం
- కాసేపట్లో కేంద్ర క్యాబినెట్ తో నిర్మలా భేటీ
- కేంద్ర క్యాబినెట్ ఆమోదం అనంతరం పార్లమెంటులో బడ్జెట్
- వరుసగా ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఐదోసారి. 2023-24 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్ కు వెళ్లి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ పై వివరించారు.
కాగా, నిర్మల ఈ ఉదయం 10.15 గంటలకు కేంద్ర క్యాబినెట్ తో సమావేశం కానున్నారు. వార్షిక బడ్జెట్ కు కేంద్ర క్యాబినెట్ లాంఛనప్రాయ ఆమోదం తెలిపిన తర్వాత బడ్జెట్ పత్రాలతో ఆమె పార్లమెంటులో ప్రవేశించనున్నారు.
ఆర్థికమంత్రులు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో చేతిలో ఎరుపు రంగు పద్దుల పుస్తకంతో దర్శనమిస్తారు. ఇది సంప్రదాయంగా వస్తోంది. అయితే కరోనా దృష్ట్యా గత రెండేళ్లుగా కాగిత రహిత బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో నిర్మల ఈసారి కూడా చేతిలో ట్యాబ్ సాయంతో బడ్జెట్ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.
ఇక, 2023-24 బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత ముంగిట నిలిచారు. వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన భారత ఆర్థికమంత్రుల జాబితాలో నిర్మల ఆరోస్థానంలో నిలుస్తారు. గతంలో ఈ ఘనత మొరార్జీ దేశాయ్, మన్మోహన్ సింగ్, యశ్వంత్ సిన్హా, చిదంబరం, అరుణ్ జైట్లీలు సొంతం చేసుకున్నారు.
ఈసారి బడ్జెట్ లో ప్రధానంగా దేశంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ కేటాయింపులు ఉండే అవకాశం ఉంది.