Nagababu: 'గంగోత్రి' చరణ్ చేయవలసిన సినిమా: నాగబాబు
- మెగా హీరోల గురించి స్పందించిన నాగబాబు
- అన్నయ్య స్ఫూర్తితోనే ఎంట్రీ ఇచ్చారని వెల్లడి
- అదే క్రమశిక్షణతో ముందుకు వెళుతున్నారని వ్యాఖ్య
- ఆయన పేరుకు భంగం కలిగించరని వివరణ
మెగా ఫ్యామిలీకి సంబంధించి అటు రాజకీయాల పరంగాను .. ఇటు సినిమాల పరంగాను నాగబాబు స్పందిస్తుంటారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "చిరంజీవిగారిని చూసి ఆ స్పూర్తితో బయటివారు ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీకి వచ్చారు. మెగా ఫ్యామిలీకి చెందిన కుర్రాళ్లు కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకునే హీరోలుగా వచ్చారు. అదంతా కూడా అన్నయ్య గొప్పతనమే" అన్నారు.
'గంగోత్రి' సినిమా కోసం ముందుగా చరణ్ ను అడిగారు. చరణ్ కి ఇంకా కాస్త పరిణతి రావాలి .. బన్నీ అయితే కరెక్టుగా ఉంటాడని అన్నయ్య అన్నారు. దాంతో ఆ సినిమా బన్నీకి వెళ్లింది. ఆ సినిమాతో బన్నీకి మంచి పేరు వచ్చింది. ఆ తరువాత పూరి డైరెక్షన్ లో 'చిరుత' సినిమాతో చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు" అని చెప్పారు.
"సాధారణంగా ఒక ఫ్యామిలీలో ఎవరైనా ఒక రంగంలో పైకి వస్తే, మిగతా వాళ్లంతా అదే రంగాన్ని ఎంచుకుంటూ ఉంటారు. మెగా ఫ్యామిలీలోను అదే జరిగింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో కూడా అన్నయ్య అంకితభావాన్ని అనుసరిస్తూ .. క్రమశిక్షణతో ముందుకు వెళుతున్నారు. ఆయన పేరు ప్రతిష్ఠలకు ఎలాంటి భంగం కలగనీయకుండా చూసుకుంటారు" అంటూ చెప్పుకొచ్చారు.