paypal: పేపాల్లో 2 వేల మంది ఉద్యోగుల తొలగింపు
- టెక్ కంపెనీల్లో కొనసాగుతున్న ఉద్యోగ కోతల పర్వం
- సంస్థలో 7 శాతం మందిపై ఈ ప్రభావం ఉంటుందన్న పేపాల్
- కార్యాలయాలనూ మూసి ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయం
టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు గాలిలో దీపంలా మారాయి. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం ఇప్పట్లో ఆగడం లేదు. తాజాగా పేపాల్ కంపెనీ రెండు వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. పేపాల్ హోల్డింగ్స్ ఇంక్ త్రైమాసికంలో స్థూల ఆర్థిక మందగమనం కారణంగా ఉద్యోగులను తగ్గించనున్నట్లు తెలిపింది. సంస్థలో 7 శాతం మంది ఉద్యోగులపై ప్రభావం చూపేలా ఉద్యోగుల కోత ఉంటుందని పేపాల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాన్ షుల్మాన్ చెప్పారు. కొన్ని వారాల్లో తొలగింపులు జరుగుతాయని ఉద్యోగులకు మెమో పంపించారు.
పేమెంట్ గేట్ వే కంపెనీ అయిన పేపాల్ స్టాక్ దెబ్బతింది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత చెల్లింపుల పరిమాణంలో వృద్ధి మందగించడం దీనికి కారణమైంది. త్రైమాసిక వృద్ధి తగ్గిన కారణంగా కంపెనీలో ఉద్యోగాల కోతతో పాటు కార్యాలయాల మూసివేతతో ఖర్చులు తగ్గించుకోవాలని పేపాల్ నిర్ణయించింది. ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచుకునేందుకు తమ కంపెనీ ప్రణాళికలు రూపొందించిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాన్ షుల్మాన్ చెప్పారు.