USA: మా దేశానికి రండి.. మోదీకి అమెరికా అధ్యక్షుడి ఆహ్వానం
- బైడెన్ ఆహ్వానాన్ని మోదీ మన్నించారన్న పీఎంవో
- త్వరలోనే అమెరికాలో మోదీ పర్యటిస్తారని వెల్లడి
- సెప్టెంబర్ లో జి 20 సదస్సు కోసం బైడెన్ ఇండియా టూర్
అమెరికాలో పర్యటించాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందిందని ప్రధాన మంత్రి కార్యాలయం బుధవారం వెల్లడించింది. ఈమేరకు ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానించారని పేర్కొంది. ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోదీ మన్నించారని, త్వరలోనే ఆ దేశంలో పర్యటిస్తారని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జి 20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు బైడెన్ భారత్ కు రానున్నారు.
అదేవిధంగా జూన్, జులై నెలల్లో అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ సెషన్ లు జరగనున్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మోదీ పర్యటనకు అనుకూలమైన షెడ్యూల్ ను రూపొందిస్తామని పీఎంవో వివరించింది. ప్రధాని మోదీ 2021 లోనూ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో వాషింగ్టన్ లో బైడెన్, మోదీల మధ్య తొలి ద్వైపాక్షిక సమావేశం జరిగింది. తాజా ఆహ్వానం మేరకు ఈ ఏడాది మరోమారు మోదీ అమెరికాలో పర్యటిస్తారు.
ఈ పర్యటనలో అమెరికా కాంగ్రెస్ లో ప్రధాని మోదీ ప్రసంగిస్తారని సమాచారం. మోదీ గౌరవార్థం అమెరికా అధ్యక్ష భవనంలో బైడెన్ విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా, గతేడాది బాలిలో జరిగిన జి 20 సదస్సులో ఇరువురు నేతలు కలుసుకున్నారు.