Sajjala Ramakrishna Reddy: టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాకే కోటంరెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు: సజ్జల
- ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్న కోటంరెడ్డి
- ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్న సజ్జల
- సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారని వెల్లడి
ఫోన్ ట్యాపింగ్ అంటూ ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ నేతలు మూకుమ్మడి విమర్శల దాడికి దిగారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ... టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమైన తర్వాతే కోటంరెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కొంతమందిని ఎలా లాక్కోవాలో చంద్రబాబుకు బాగా తెలుసని సజ్జల వ్యాఖ్యానించారు.
అయినా, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఇంకా ఎవరినీ నియమించలేదని అన్నారు.
"కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయనే తన ఉద్దేశాలు వెల్లడించిన తర్వాత ఏం చర్యలు తీసుకోగలం? సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారే తప్ప ఫోన్ ట్యాపింగ్ లను నమ్ముకుని కాదు. ఎవరు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. పదవి రాలేదన్న అసంతృప్తి ఉండడం వేరు, బహిరంగంగా ఇలాంటి ఆరోపణలు చేయడం వేరు" అంటూ సజ్జల పేర్కొన్నారు.
వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ... టీడీపీ డైరెక్షన్ లోనే కోటంరెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని, మంత్రి పదవి రాలేదన్న అక్కసుతోనే శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. ఆనంకు సెక్యూరిటీ తగ్గించలేదని, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.