Team India: న్యూజిలాండ్ బౌలర్లను ఊచకోత కోసిన గిల్.. టీమిండియా భారీ స్కోరు
- 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసిన భారత్
- 126 పరుగులతో చెలరేగిన శుభ్ మన్ గిల్
- 44 పరుగులు చేసిన త్రిపాఠి
అహ్మదాబాద్ లో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు సాధించింది. యువ సంచలనం శుభ్ మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగి, న్యూజిలాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. 63 బంతులను ఎదుర్కొన్న గిల్ 7 సిక్సర్లు, 12 ఫోర్లతో 126 పరుగులతో అజేయంగా నిలిచాడు. తన టీ20 కెరీర్లో తొలి సెంచరీని సాధించాడు.
అంతకు ముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఇషాన్ కిషన్, గిల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. అయితే కేవలం మూడు బంతులను మాత్రమే ఎదుర్కొన్న ఇషాన్ ఒక పరుగు మాత్రమే చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రాహుల్ త్రిపాఠి 44 (22 బంతులు, 3 సిక్సర్లు, 4 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ 24 (13 బంతులు, 2 సిక్సర్లు, 1 ఫోర్), హార్దిక్ పాండ్యా 30 (17 బంతులు, 1 సిక్సర్, 4 ఫోర్లు) పరుగులు సాధించారు. దీపక్ హుడా 2 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో బ్రేస్ వెల్, టిక్నర్, సోధి, మిచెల్ చెరో వికెట్ సాధించారు. 235 పరుగుల విజయలక్ష్యంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ ను ప్రారంభించింది.