Income tax: ఆదాయపన్ను కొత్త.. పాత విధానాల్లో ఎవరికి ఏది మెరుగు?

Income tax clarity day after Budget 2023 Which scheme works for you best

  • నూతన పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చిన ఆర్థిక మంత్రి
  • రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కొత్త విధానానికీ వర్తింపు
  • రూ.7.5 లక్షల వరకు ఆదాయంపై నికరంగా పన్ను చెల్లించక్కర్లేదు

బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి ఆదాయ పన్ను శ్లాబు రేట్లలో మార్పులు చేశారు. ప్రస్తుతం ఆదాయపన్ను పరంగా రెండు విధానాలు అమల్లో ఉన్నాయి. ఇందులో ఎప్పటి నుంచో కొనసాగుతున్న విధానం ఒకటి అయితే.. రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన నూతన విధానం మరొకటి. ఇప్పుడు పాత ఆదాయపన్ను విధానంలో కేంద్ర ఆర్థిక మంత్రి ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త విధానానికి ఎక్కువ మందిని మళ్లించే విధంగా అందులో మార్పులు చేశారు.

పాత విధానం
పాత పన్ను విధానంలో రూ.2.5 లక్షల ఆదాయంపై ఎలాంటి పన్ను లేదు. రూ.2.51 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను అమలవుతోంది. అయినప్పటికీ, రూ.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించే అవసరం లేకుండా రూ.2.5 లక్షలపై 5 శాతం అంటే రూ.12,500 రిబేట్ ను కేంద్ర సర్కారు ఇస్తోంది. కనుక ఆదాయం రూ.5 లక్షలు దాటిన వారే పన్ను చెల్లించాల్సి వస్తుంది. రూ.5,00,001 నుంచి రూ.10,00,000 వరకు ఆదాయంపై 20 శాతం, రూ.10 లక్షలు మించిన ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 

కాకపోతే పాత విధానంలో కొన్ని పన్ను మినహాయింపుల ప్రయోజనాలు ఉన్నాయి. సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్, జీవిత బీమా పాలసీలు, పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులు, ఎన్ఎస్ సీ, ఈఎల్ఎస్ఎస్ ఇలా ఎన్నో రకాల సాధనాల్లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ ప్రకారం రూ.6.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించక్కర్లేదు. అలాగే, రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం ఉంది. దీంతో రూ.7,00,000 లక్షల వరకు పన్ను చెల్లించక్కర్లేదు. 

దీనికితోడు ఎన్ పీఎస్ స్కీమ్ లో రూ.50,000 ఇన్వెస్ట్ చేసి క్లెయిమ్ కోరొచ్చు. గృహ రుణం తీసుకుని ఈఎంఐ చెల్లించేట్టు అయితే సెక్షన్ 24 కింద ఒక ఆర్థిక సంవత్సరంలో గృహ రుణంపై చెల్లించే వడ్డీ రూ.2,00,000 వరకు ఉంటే దానిపైనా పన్ను మినహాయింపు కోరొచ్చు. అంటే రూ.9.5 లక్షల వరకు పన్ను లేదు. సెక్షన్ 80డీ కింద హెల్త్ ఇన్సూరెన్స్ కోసం కుటుంబ సభ్యుల పేరిట చెల్లించే ప్రీమియం రూ.25 వేలు ఉంటే దానిపైనా క్లెయిమ్ తీసుకోవచ్చు. 60 ఏళ్లు నిండిన తల్లిదండ్రుల హల్త్ ఇన్సూరెన్స్ కు ప్రీమియం చెల్లించడం ద్వారా మరో రూ.50 వేలపైనా క్లెయిమ్ మినహాయింపు కోరొచ్చు. 

కొత్త విధానం
కానీ, కొత్తగా ప్రతిపాదించిన ఆదాయపన్ను విధానంలో ఇలాంటి పన్ను మినహాయింపుల్లేవు. కొత్త పన్ను విధానంలో రూ.3,00,001 నుంచి రూ.6,00,000 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం పన్ను రేటు, 6,00,001 నుంచి రూ.9,00,000 ఆదాయంపై 10 శాతం రేటు, రూ.9,00,001 నుంచి రూ.12,00,000 వరకు ఆదాయంపై 15 శాతం, రూ.12 లక్షలకు మించిన ఆదాయంపై 20 శాతం, రూ.15 లక్షలకు మించిన ఆదాయంపై 30 శాతం రేటుగా ప్రకటించారు. 

కాకపోతే రూ.7 లక్షల వరకు ఆదాయం ఉంటే పన్ను చెల్లించే అవసరం లేకుండా రిబేట్ కల్పించారు. దీంతో రూ.7 లక్షల వరకు పన్ను చెల్లించక్కర్లేదు. దీనికి రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా కల్పించారు. దీంతో నికరంగా రూ.7.5 లక్షల ఆదాయం వరకు నూతన పన్ను విధానంలో పన్ను లేకుండా చేశారు. కనుక పాత పన్ను విధానంలో పన్ను మినహాయింపులు అన్నింటినీ ఉపయోగించుకునే వారు అందులోనే కొనసాగడం మంచిది. ఈ మినహాయింపుల కోసం వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయని వారు, రుణంపై ఇల్లు కొనుగోలు చేయని వారు, కొనుగోలు చేసే ఉద్దేశ్యం లేని వారు నూతన పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. తదుపరి రిటర్నులు ఫైల్ చేసే సమయంలో నూతన పన్ను విధానం అక్కడ డిఫాల్ట్ గా ఉంటుంది. దాన్ని వద్దనుకుంటే పాత పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News