Polavaram Project: పోలవరం నిర్వాసిత కుటుంబాలకు పరిహారాన్ని నేరుగా బదిలీ చేయడం వీలుకాదు: తేల్చేసిన కేంద్రం
- పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోందన్న కేంద్రమంత్రి
- బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని వెల్లడి
- ఖర్చులను తిరిగి చెల్లించడంలో ఎలాంటి జాప్యం చేయడం లేదని వివరణ
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించినంత సహకారం కూడా అందడం లేదు. మరోవైపు నిర్వాసిత కుటుంబాలకు పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం నేరుగా బదిలీ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రాష్ట్రమే చేపడుతున్నందున కేంద్రం నగదు బదిలీ చేయడం కుదరదని తెలిపింది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తున్నామని చెప్పింది.
లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీకి ఖర్చులను తిరిగి చెల్లించడంలో ఎలాంటి జాప్యం చేయడం లేదని చెప్పారు. భూసేకరణ కింద 2014 నుంచి 2022 డిసెంబర్ వరకు ఏపీ ప్రభుత్వం రూ. 3,779.5 కోట్లకు బిల్లులను సమర్పించగా ... రూ. 3,431.59 కోట్లను చెల్లించామని తెలిపారు. సహాయ పునరావాస ప్యాకేజీ కింద 2014 నుంచి 2022 డిసెంబర్ వరకు రూ. 2,267.29 కోట్లకు బిల్లులను సమర్పించగా ఇప్పటి వరకు రూ. 2,110.23 కోట్లను తిరిగి చెల్లించామని వెల్లడించింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వమే చేపట్టినందున... ముంపు బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ చేయడం సాధ్యం కాదని చెప్పింది.