Nara Lokesh: సీబీఐ వస్తే జగన్ కాళ్లు వణుకుతున్నాయ్.. ప్యాంటు తడిచిపోతోంది: నారా లోకేశ్
- జగన్ పతనం నెల్లూరు నుంచి ప్రారంభమయిందన్న లోకేశ్
- మూడున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేకపోయారని విమర్శ
- మోదీ వస్తే కాళ్లు పట్టుకోవడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం మొదలైందని... సీఎం జగన్ పతనం నెల్లూరు నుంచి మొదలైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పాదయాత్రలో భాగంగా పలమనేరు క్లాక్ టవర్ సెంటర్ లో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పలమనేరులో జనసంద్రం చూస్తుంటే నోట మాట రావడం లేదని అన్నారు. అందరినీ ఉద్ధరిస్తానంటూ ఎన్నికలకు ముందు జగన్ చెపితే అందరూ నమ్మారని... ఉద్యోగాలు ఇస్తానని, 45 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానంటే మురిసిపోయారని... 151 సీట్లతో జగన్ కు అధికారాన్ని కట్టబెట్టారని చెప్పారు. మూడున్నరేళ్ల కాలంలో రాష్ట్రానికి ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేక పోయారని ఎద్దేవా చేశారు.
పట్టురైతులకు 19 ఏళ్లుగా ఇస్తున్న సబ్సిడీని జగన్ రద్దు చేశారని లోకేశ్ దుయ్యబట్టారు. రాయలసీమకు అత్యంత కీలకమైన డ్రిప్ ఇరిగేషన్ ను కూడా సైకో జగన్ అటకెక్కించారని విమర్శించారు. పంట పొలాలకు వాడే మందులు పని చేయడం లేదని, జగన్ తయారు చేస్తున్న కల్తీ లిక్కర్ పురుగు మందు కంటే బాగా పని చేస్తోందని అన్నారు. కేసుల నుంచి బయట పడేందుకే జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. మోదీ వస్తే కాళ్లు పట్టుకోవడానికి జగన్ రెడీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. సీబీఐ వాళ్లు వస్తే జగన్ కాళ్లు వణికిపోతున్నాయని... ప్యాంటు తడిచిపోతోందని అన్నారు.
25 ఎంపీ సీట్లు వస్తే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్... కేసుల నుంచి బయటపడేందుకు ఢిల్లీ ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని చెప్పారు. తల్లి, చెల్లిని మెడబట్టి బయటకు గెంటేసిన వాడిని ఏమంటామని ప్రశ్నించారు. వారిని క్రిమినల్స్ అంటామని చెప్పారు. తాడేపల్లిలో ఒక క్రిమినల్ ఉంటాడని, ఆయన చుట్టూ క్రిమినల్స్ ఉంటారని అన్నారు. పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ మంత్రి పెద్దిరెడ్డి బినామీ అని ఆరోపించారు. జిల్లాలో ప్రతి కుంభకోణం వెనుక పెద్దిరెడ్డి ఉన్నాడని విమర్శించారు.