Nellore District: వాగులోకి దూకి పరారైన నిందితుడు.. ఏమయ్యాడో తెలియక తలలు పట్టుకున్న పోలీసులు!

The accused escaped by jumping into the river in Nellore Dist

  • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘటన
  • ఆభరణాలు దోచుకుంటున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • సంకెళ్లు తొలగించుకుని వాగులోకి దూకి పరారీ
  • గజ ఈతగాళ్లతో గాలించినా ఫలితం శూన్యం

మహిళల నుంచి బంగారు ఆభరణాలను దోచుకుంటున్న ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడు వాగులోకి దూకి అదృశ్యమయ్యాడు. ఒక రోజు గడిచినా అతడి ఆచూకీ తెలియకపోవడంతో ఏమయ్యాడో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఒంటరిగా ఉన్న మహిళలపై కన్నేసి వారి నుంచి బంగారు నగలు దోచుకుంటున్న ఆరోపణలపై ఉప్పుటూరుకు చెందిన ఎ.గిరి, మరో నిందితుడిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

విచారణ కోసం వీరిని బుధవారం రాత్రి ఏఎస్ పేటకు తీసుకెళ్లారు. విచారణ అనంతరం తిరిగి నెల్లూరు తీసుకొస్తుండగా నిందితుడు గిరి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా తనతో కలిసి దొంగతనాలకు పాల్పడే వ్యక్తి సంగంలోని కొండ ప్రాంతంలో ఉంటాడని పోలీసులకు చెప్పాడు. అతడ్ని కూడా పట్టుకోవచ్చని చెప్పడంతో పోలీసులు తమ వాహనాన్ని అటువైపు మళ్లించారు. 

ఆత్మకూరు మార్గంలో బీరాపేట వాగు, పెన్నానది కలిసే ప్రాంతానికి వాహనం చేరుకోగానే పోలీసులను మాటల్లో పెట్టాడు. వాహనం నెమ్మదిగా వెళ్తుండగా తోటి నిందితుడితో వేసిన సంకెళ్లను తొలగించుకున్న గిరి ఒక్కసారిగా వాహనం నుంచి కిందికి దూకి పరుగులు పెట్టాడు. పోలీసులు అప్రమత్తమై వాహనం దిగి వెంబడించడంతో వాగులోకి దూకి అదృశ్యమయ్యాడు.

దీంతో పోలీసులు స్థానికులను పిలిపించి వాగులో గాలించినా ఫలితం లేకుండా పోయింది. గురువారం మళ్లీ గజ ఈతగాళ్లతో వాగును జల్లెడ పట్టినా అతడి జాడ కనిపించలేదు. దీంతో నిందితుడు తప్పించుకున్నాడా? లేదంటే వాగులో గల్లంతయ్యాడా? అన్న విషయం తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News