Supreme Court: మన సుప్రీంకోర్టులో సింగపూర్ సీజే
- సుప్రీంకోర్టు 73వ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన సింగపూర్ సీజే
- కోర్టులో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ బెంచ్ తో కలిసి కూర్చున్న జస్టిస్ సుందరేశ్ మీనన్
- ‘ప్రపంచాన్ని మార్చడంలో న్యాయ వ్యవస్థ పాత్ర’పై రేపు ప్రసంగం
సుప్రీంకోర్టులో ఈరోజు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంతో కలిసి సింగపూర్ సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సుందరేశ్ మీనన్ కూర్చున్నారు.
సుప్రీంకోర్టు 73వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించనున్న కార్యక్రమానికి హాజరయ్యేందుకు భారత్ కు జస్టిస్ మీనన్ వచ్చారు. ఈ సందర్భంగానే సీజేఐ బెంచ్ తోపాటు కోర్టులో కూర్చున్నారు. ఇక రేపు నిర్వహించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జస్టిస్ మీనన్ పాల్గొంటారు. ‘ప్రపంచాన్ని మార్చడంలో న్యాయ వ్యవస్థ పాత్ర’ అనే అంశంపై జస్టిస్ మీనన్ ప్రసంగిస్తారు.
‘‘భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో సింగపూర్ సీజే చర్చలు జరుపుతారు. రెండు న్యాయవ్యవస్థల మధ్య మరింత సహకారం, న్యాయ విద్య, జ్ఞానాన్ని పంచుకునే అవకాశాల గురించి చర్చించే అవకాశం ఉంది’’ అని సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. 1950 జనవరి 28న భారత సుప్రీంకోర్టు మనుగడలోకి వచ్చింది.